న్యూ బోయిగూడలో ఉగ్రమూలాలు..సమీర్​ అరెస్ట్​తో ఉలిక్కిపడ్డ కళారంగ్​ కాలనీ వాసులు

న్యూ బోయిగూడలో ఉగ్రమూలాలు..సమీర్​ అరెస్ట్​తో ఉలిక్కిపడ్డ కళారంగ్​ కాలనీ వాసులు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్​న్యూబోయిగూడలో ఉగ్ర కార్యకలాపాలు వెలుగులోకి రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. తెలంగాణ, ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్, న్యూబోయిగూడలోని కళారంగ్​కాలనీకి చెందిన సమీర్ (25)ను ఇటీవల అరెస్ట్ చేశారు. అహిం పేరిట ఉగ్రవాద కార్యకలాపాలు ప్రారంభించిన వీరిద్దరూ ఇప్పటికే ఓసారి బాంబు పేలుళ్లకు రిహార్సల్స్ నిర్వహించారు. సౌదీ హ్యాండ్లర్ ఆదేశాల మేరకు మళ్లీ బాంబు పేలుళ్ల పరీక్షకు సిద్ధమవుతుండగా పట్టుకున్నారు.

తొలుత విజయనగరంలో సిరాజ్​ను అరెస్ట్ చేయగా, అతడి ఇచ్చిన సమాచారంతో బోయిగూడ వాసి సమీర్​ను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి చాలా ఏండ్ల క్రితం చనిపోవడంతో సమీర్ తన సొంత ఇంట్లో తల్లి సాబేరా, అక్క ఆలియాతో కలిసి నివాసం ఉంటున్నాడు. పదో తరగతి వరకు చదివి, లిఫ్ట్ మెకానిక్​పనిచేస్తున్నాడు. బస్తీలో ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా, తన పని తాను చేసుకుంటూ ఉండే సమీర్ దేశ విద్రోహ కార్యకలాపాలకు  ఆకర్షితుడవుతాడని ఊహించలేదని బస్తీ వాసులు అంటున్నారు.

ఎప్పుడు పాతబస్తీకి చెందిన పలు బ్యాచ్​లతో కలసి ఇంట్లో సమావేశమయ్యే వాడన్నారు. సోషల్​మీడియా ద్వారా ఉగ్ర భావజాలానికి ఆకర్షితుడై, సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో బాంబు పెట్టేందుకు సమీర్​కుట్రపన్నాడని పోలీసులు తమతో చెప్పారని స్థానికులు తెలిపారు. ఎప్పుడు తమ కాలనీ వాళ్లతో సమీర్​తల్లి, సోదరి గొడవపడుతుంటారని, వారిని కాలనీ నుంచి ఖాళీ చేయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశానికి నష్టం కలిగించే విద్రోహ చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

నా తమ్ముడికి ఏం సంబంధం లేదు: ఆలియా

ఉగ్రవాద సంస్థలతో తమ తమ్ముడికి ఎటువంటి సంబంధం లేదని సమీర్ సోదరి ఆలియా అన్నారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడారు. తమ ఇంటికి ఎటువంటి టెర్రరిస్టు మూలాలు ఉన్న వారు రాలేదని,ఈనెల 16నన తమ ఇంటికి పోలీసులు వచ్చి తమ తమ్ముడిని తీసుకవెళ్లారని పేర్కొన్నారు. అసలు సిరాజ్ ఎవరో తమకు తెలియదని, తన తమ్ముడు ఎటువంటి తప్పు చెయలేదన్నారు. ఇన్ స్టాగ్రామ్ గ్రూప్ ను కేవలం పేదలకు సహయం చేయాలన్న ఉద్దేశ్యంతో పెట్టామని, ఏ విచారణకైన తాము సహకరిస్తామన్నారు. తమ ఇంట్లో ఎటువంటి ఉగ్రవాదానికి సంబందించి ఆధారాలు దోరకలేదన్నారు.