- జూన్1 నుంచి షురూ
- పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు
- ఉన్నవి 5.477 టీఎంసీలే
- 70 ఎంజీడీల చొప్పున నీటి సరఫరా
- డెడ్ స్టోరేజీకి చేరువలో నీళ్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తున్న ప్రధాన జలాశయాల్లో ఒకటైన సింగూరు రిజర్వాయర్‌లో నీటి మట్టాలు పడిపోయాయి. దీంతో అధికారులు ఎమర్జెన్సీ పంపింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి పంపింగ్ ప్రారంభమవుతుందని వాటర్ బోర్డు అధికారులు ప్రకటించగా, దీనిపై శుక్రవారం బోర్డు ఎండీ అశోక్ రెడ్డి ఆరా తీశారు. పటాన్చెరు ట్రాన్స్మిషన్డివిజన్– -2 పరిధిలో జరుగుతున్న ఎమర్జెన్సీ పంప్‌సెట్ అలైన్మెంట్ పనులను ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. రిజర్వాయర్పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.477 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. గ్రేటర్ తాగునీటి అవసరాలకు వివిధ రిజర్వాయర్ల నుంచి రోజూ 560 ఎంజీడీలు తీసుకువస్తుండగా, సింగూరు నుంచే 70 ఎంజీడీలు సరఫరా అవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్నయ్ 5 టీఎంసీలే..
రిజర్వాయర్‌ను రిపేర్చేయాల్సి ఉందన్న కారణంతో ఇరిగేషన్అధికారులు ఆరు నెలల కిందటే నీటిని ఖాళీ చేశారు. అప్పుడు 20 టీఎంసీలు ఉండగా 15 టీఎంసీలు బయటకు వదిలిపెట్టారు. కానీ, ఇప్పటివరకు రిపేర్లే మొదలుపెట్టలేదు. ప్రస్తుతం సింగూరులో 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో ఇవి డెడ్‌స్టోరేజీకి (3 టీఎంసీలు) చేరుకోబోతున్నాయి. ఉన్న నీళ్లు కూడా 60 రోజులకు మాత్రమే సరిపోతాయని, జూన్ లో వర్షాలు పడకపోతే నగరానికి తాగునీటి కటకట తప్పదని అధికారులు అంటున్నారు.
ఎక్కడెక్కడి నుంచి ఎంత వస్తున్నయ్
నగరానికి ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ నుంచి 23 ఎంజీడీలు, హిమాయత్ సాగర్ నుంచి 11 , మంజీరా నుంచి 40, నాగార్జునసాగర్ నుంచి 275 , ఎల్లంపల్లి నుంచి 163 ఎంజీడీల నీటిని తీసుకువస్తున్నారు. మొత్తంగా కోర్అర్బన్ రీజియన్(క్యూర్)పరిధిలో నీటి అవసరాలకు 800 ఎంజీడీల డిమాండ్ఉండగా 560 ఎంజీడీలు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. మరో 240 ఎంజీడీల కొరత ఉంది. జూన్‌లో భారీ వర్షాలు పడకపోతే సింగూరు నుంచి వచ్చే 70 ఎంజీడీలు ఆగిపోతాయి. దీనివల్ల నీటి కొరత 310 ఎంజీడీలకు చేరుతుంది. దీంతో నగరానికి నీటి కష్టాలు పెరిగే అవకాశం ఉంటుంది.
అసలేంటీ ఎమెర్జెన్సీ పంపింగ్..?
సాధారణంగా జలాశయాల్లోని రా వాటర్‌ను పక్కనే నిర్మించిన ఇంటెక్ వెల్‌లోకి నేరుగా గ్రావిటీ ద్వారా తరలిస్తారు. అక్కడి నుంచి ట్రీట్‌మెంట్‌ప్లాంట్‌కు నీరు వెళ్తుంది. అక్కడ ట్రీట్చేసిన నీటిని పైప్లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు. అయితే జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న సమయంలో నిర్ణీత లెవెల్వరకు మాత్రమే నీరు నేరుగా ఇంటెక్ వెల్‌లోకి వెళ్తుంది. ఇలాంటి సమయంలో అత్యవసర (ఎమెర్జెన్సీ) పంపింగ్ అవసరం అవుతుంది. ఇంటేక్ వెల్‌కు సమీపంలోనే భారీ పైపులు, మోటార్లను బిగించి ఇంటెక్వెల్లోకి పంపింగ్ చేస్తారు. ప్రస్తుతం సింగూరులో నీటి నిల్వలు తగ్గుతూ డెడ్ స్టోరేజీకి దగ్గరవుతున్న కారణంగా మెట్రోవాటర్‌బోర్డు అధికారులు అత్యవసర పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రధాన జలాశయాల్లో మే 29 నాటికి నీటి నిల్వలు(టీఎంసీల్లో)
రిజర్వాయర్ ఫుల్కెపాసిటీ గతేడాది ప్రస్తుతం
ఉస్మాన్‌సాగర్ 3.900 2.673 2.825
హిమాయత్ సాగర్ 2.967 2.058 2.331
సింగూరు 29.917 16.982 5.470
మంజీరా 1.500 0.758 0.370
నాగార్జున సాగర్ 312.045 135.950 152.760
ఎల్లంపల్లి 20.175 8.412 8.548
