ప్రముఖ నర్తకి శోభానాయుడు కన్నుమూత

ప్రముఖ నర్తకి శోభానాయుడు కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభానాయుడు కన్నుమూశారు . కొన్ని రోజుల కిందట తన ఇంట్లో జారిపడటంతో శోభ తలకు బలమైన గాయమైంది. అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె పలు రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున శోభానాయుడు తుదిశ్వాస విడిచారు. వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో 1956లో శోభ జన్మించారు. శోభానాయుడు వెంపటి చిన సత్యం శిష్యురాలు. వెంపటి నృత్యరూపాలలో ఆమె అన్ని ప్రధాన పాత్రలనూ పోషించింది. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో ఆమె బాగా రాణించింది. శోభానాయుడుకు 1982లో నృత్య చూడామణి, 1998లో ఎన్టీయార్ పురస్కారం, 1990లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2001లో పద్మ శ్రీ పురస్కారం, 2011లో తంగిరాల కృష్ణ ప్రసాద్ స్మారక అవార్డులు వరించాయి.

శోభానాయుడుకు ‘తానా’ సంతాపం
శోభానాయుడు ఆకస్మిక మరణంపై తెలుగు అసొసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) సంతాపం తెలిపింది. శోభ ఆకస్మిక మృతి కళా రంగానికి తీరని లోటు అని పేర్కొంది. ఆమె కుటుంబ సభ్యులకు తానా అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, కార్యదర్శి పొట్లూరి రవి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి వేల మందికి కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇచ్చి కళారంగానికి ఎనలేని సేవలు చేశారని శోభానాయుడును కొనియాడారు. తానాతో శోభానాయుడుకు దశాబ్దాల అనుబంధం ఉందని, పలు మార్లు తానా మహాసభలకు ఆమె విచ్చేసి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2010, జులై 31వ తేదీని “తానా శోభానాయుడు డే”గా డల్లాస్‌లో జరుపుకొని అవార్డుతో స‌త్క‌రించిన‌ట్లు జయశేఖర్ తాళ్లూరి పేర్కొన్నారు.