ప్ర‌భుత్వ భ‌వ‌నంలో సీఎం మృత‌దేహాం ఉంచార‌ని ఉద్యోగుల‌ శాంతి హోమాలు

ప్ర‌భుత్వ భ‌వ‌నంలో సీఎం మృత‌దేహాం ఉంచార‌ని ఉద్యోగుల‌ శాంతి హోమాలు

ముఖ్య‌మంత్రి పార్థీవ దేహం ఉంచ‌డంతో అక్కడి స్థ‌లం అపవిత్ర‌మైన‌దని భావించి శాంతి హోమం నిర్వ‌హించారు అక్క‌డి అధికారులు, ఉద్యోగులు. ఈ ఘ‌ట‌న గోవాలోని ప‌నాజీలో చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం గోవా ముఖ్య‌మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ కాలేయ వ్యాధితో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. మ‌ర‌ణానంతంరం ఆయ‌న పార్థీవ దేహాన్ని ప్ర‌జ‌ల సంద‌ర్శానార్ధం స్థానిక క‌ళా అకాడ‌మీలో ఉంచి.. ఆ త‌ర్వాత అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు.

అయితే క‌ళా అకాడ‌మీలో ఆయ‌న మృత‌దేహాన్ని ఉంచ‌డం ద్వారా కీడు జ‌రుగుతుంద‌ని భావించి అకాడ‌మీలోని అధికారులు, ఉద్యోగులు శాంతి హోమం నిర్వ‌హించారు. ఈ చ‌ర్య‌ల గురించి తెలుసుకున్న అక్క‌డి సాంస్కృతిక‌ మంత్రి గోవింద్ గౌడ్ వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించారు. ప్ర‌భుత్వ భ‌వనాల్లో ఇలాంటి కార్య‌కలాపాల‌ను ప్రోత్స‌హించమంటూ సోష‌ల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన అకాడ‌మీ అధికారులు..దివంగ‌త సీఎం మృత‌దేహాన్ని ఐదు గంటల పాటు కళా అకాడెమీ ప్రాంగణంలో ఉంచార‌ని, దీంతో ఏదైనా అరిష్టం జ‌రుగుతుందేమోన‌న్న‌ ఉద్ధేశ్యంతో శ‌నివారం ఉద‌యం ఐదుగురు పూజారుల‌తో హోమాన్ని నిర్వ‌హించామ‌ని తెలిపారు. ఈ విష‌యం మంత్రికి కూడా తెలుస‌ని వారు మీడియాతో అన్నారు.

“క‌ళా అకాడ‌మీలో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. వారంతా అకాడ‌మీకి సంబంధించి ఏవో మ‌త‌ప‌ర‌మైన పూజ‌లు చేయాల‌ని,అందుకు నా అనుమ‌తి కావాల‌ని అన్నారు. అందుకు నేనూ అంగీకరించాను. కానీ ఇలాంటి శాంతి హోమం జ‌రిగింద‌నే విష‌యం నాకు తెలియ‌ద‌ని” మంత్రి గోవింద్ గౌడ్ వివ‌రణ ఇచ్చుకున్నారు.

ఏదీ ఏమైనా ఓ ప్ర‌భుత్వ భ‌వ‌నంలో ఇలాంటి హోమాలు జ‌ర‌గ‌డం, అదీ కూడా మ‌ర‌ణించేంత వ‌ర‌కూ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సు కోసం ప‌నిచేసిన పారిక‌ర్ మృతి ప‌ట్ల అకాడ‌మీ ఉద్యోగులు ఇలాంటి కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డ‌డం ప్ర‌స్తుతం రాష్ట్రంలో వివాదాస్ప‌దంగా మారింది.