ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ చాన్స్ ఉంది

ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ చాన్స్ ఉంది
  •      వాట్సప్ వైరల్ మెసేజ్ పై ఈసీ క్లారిటీ

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయకుండా నిషేధం విధించినట్లు నెట్టింట చక్కర్లు కొడుతున్న వాట్సాప్ మెసేజ్​పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించింది. అది తప్పుదోవ పట్టించే ఫేక్ మెసేజ్ అంటూ ట్వీట్ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన అధికారులు తమకు కేటాయించిన కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. 

ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకున్న అధికారులు పోలింగ్ రోజు డ్యూటీలో ఉంటారు. వారు సొంత పోలింగ్ స్టేషన్లలో ఓటు వేయలేరు.  అందుకే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఎన్నికల సంఘం వీలు కల్పించింది. ఎన్నికల డ్యూటీలో  ఉన్న ఓటర్లే కాకుండా, ప్రత్యేక ఓటర్లు, సర్వీస్ ఓటర్లు, ప్రివెంటివ్ డిటెన్షన్‌కు గురైన ఓటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి ఈసీ వెసులుబాటు కలిగించింది. 

పోలింగ్ రోజున ఓటర్ కార్డు మర్చిపోతే..

పోలింగ్ రోజు బూత్ కు ఓటర్ కార్డు తీసుకెళ్లడం మర్చిపోయినా ఫర్వాలేదని ఈసీ తెలిపింది. ఓటర్ లిస్టులో పేరు ఉంటే.. ఓటు వేసేందుకు ఇతర గుర్తింపు కార్డులు చూపించవచ్చని వెల్లడించింది. ఆధార్ కార్డు, పాస్ పోర్ట్,  డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఫొటో గుర్తింపు కార్డు,  ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం,  బ్యాంకులు, పోస్టాఫీసు జారీ చేసిన పాసుపుస్తకం (ఫొటోతో ఉన్నవి), జనగణన ఆధారంగా జారీ చేసిన స్మార్ట్ కార్డ్, ఎంఎస్ఆర్డీఏ జారీ చేసిన జాబ్ కార్డు, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు, యూనిక్ డిజెబిలిటీ ఐడీ(యూడీఐడీ) కార్డు, ఫొటోతో జత చేసిన పింఛను పత్రాలు వంటివి ఓటర్ కార్డుకు బదులుగా చూపించి ఓటు వినియోగించవచ్చని ఈసీ పేర్కొంది.