
- ఫారెస్ట్ అధికారుల వింతపోకడ
- ఉన్న అధికారులపైనే అదనపు భారం
- పెండింగ్‌లోనే ఫైల్స్, అభివృద్ధి పనులు
- రాష్ట్రంలో 10 ఫారెస్ట్ సర్కిళ్లలో నలుగురు ఇన్‌చార్జ్‌లే..
హైదరాబాద్, వెలుగు: అటవీశాఖలో కొంతమంది అధికారులు డిప్యూటేషన్‌పై ఇతర శాఖలో పనిచేస్తుండటంతో ఈ శాఖలో కొరత ఏర్పడుతున్నది. ఐదురుగు ఐఎఫ్ఎస్ అధికారులు ఇతర శాఖల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో అటవీశాఖలో ఉన్న అధికారులపై అదనపు భారపడుతున్నది. ఒక్కొక్క అధికారికి రెండు, మూడు విభాగాలకు ఇన్‌చార్జ్‌లుగా అదనపు బాధ్యతలు కట్టబెట్టడంతో ఫైళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. దీంతో ఫారెస్ట్ డెవలప్మెంట్కు విఘాతం కలుగుతుందని ఆశాఖ అధికారులే చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో అటవీశాఖలో పది సర్కిళ్లు ఉండగా.. అందులో నాలుగు సర్కిళ్లకు ఇన్చార్జ్ అధికారులే కావడం విశేషం. బాసర, రాజన్న సిరిసిల్ల, రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్& డీ), భద్రాద్రి కొత్తగూడెం, కాళేశ్వరం, చార్మినార్, జోగులాంబ, యాదాద్రి, కవ్వాల్ టైగర్ రిజర్వుఫారెస్టు (కేటీఆర్), అమ్రాబాద్ టైగర్ రిజర్వుఫారెస్టు (ఏటీఆర్) సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో ఆర్ అండ్ డీ, బాసర, రాజన్న సిరిసిల్ల, అమ్రాబాద్ టైగర్ ఫారెస్టు లకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ఫారెస్ట్‌లోనే ఇతర విభాగాలు పర్యవేక్షిస్తున్న అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ ఐదుగురు ఐఎఫ్ఎస్ అధికారులు డిప్యూటేషన్ పై ఇతర శాఖలకు వెళ్లకుంటే అటవీశాఖలోనే పూర్తి స్థాయిలో అధికారులు ఉండేవారని పేర్కొంటున్నారు. అంతేకాకుండా, టీజీఎఫ్డీసీకి కూడా పూర్తిస్థాయి ఎండీ లేరు. ములుగులోని ఎఫ్ఆర్ఐకి సైతం ఇన్చార్జ్ డీన్ కొనసాగుతున్నారు.
మాతృశాఖపై ఎందుకంత అనాసక్తి?
అటవీశాఖలోని ఐదుగురు ఐఎఫ్ఎస్ అధికారులు తమ మాతృశాఖలో పనిచేసేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. ఇతర శాఖలపై ఉన్న ఇష్టం ఈ శాఖపై లేదని తెలుస్తున్నది. అయితే, వీరు ఇతర శాఖలకు డిప్యూటేషన్ పై వెళ్లడంతో.. వీరి స్థానంలో మరో అధికారిని నియమించడం లేదు. ఆ విభాగాల బాధ్యతలను మరో అధికారికి అప్పగిస్తున్నారు. అప్పటికే వారికి ఇతర విభాగాలు బాధ్యతలు ఉండటంతో పనిభారం పెరుగుతున్నదని, పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోతున్నామని చెబుతున్నారు.
ఐఎఫ్ఎస్ (ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు)లుగా ఉద్యోగం పొందిన ఐదుగురు అటవీశాఖలో సీఎఫ్ లేక సీసీఎఫ్ కేడర్ లో పనిచేస్తున్నారు. క్షితిజ, సైదులు, ప్రసాద్, షఫీ ఉల్లా, సోనీ బాలాదేవి తదితర ఐఎఫ్ఎస్ లు ఇతర శాఖలకు డిప్యూటేషన్ పై వెళ్లారు.
ఒక్కొక్కరు ఒక్కో శాఖలో కీలకంగా బాధత్యలు నిర్వర్తిస్తున్నారు. కాగా, చార్మినార్ సర్కిల్ అధికారి ప్రియాంక వర్గీస్ కు రాజన్న సిరిసిల్ల సర్కిల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీశాఖ అడ్మిషన్ సునీత భగవత్ కు టీజీఎఫ్డీసీ ఎండీగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరితోపాటు మరికొంతమంది ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పని భారంతో ఫైల్స్ పెండింగ్‌లో ఉంటున్నాయని సమాచారం.
దీనికితోడు అటవీశాఖలో సీనియర్ అధికారుల కొరత వేధిస్తుండటంతో అభివృద్ధి ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతున్నాయని వాపోతున్నారు. కొన్నివిభాగాలకు అధికారులున్నా.. వారికి ఆయా విభాగాలపై పట్టులేకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి.