స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌లో ఫేషియల్‌‌ నిఘా

స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌‌లో ఫేషియల్‌‌ నిఘా
  • ఉద్యోగులు 3 రోజులు లేటుగా వస్తే ఒక సెలవు కట్‌‌
  • ఉదయం10.40 దాటితే లేట్ కింద లెక్క 
  • సాయంత్రం 5 గంటల లోపు వెళ్లినా చర్యలు

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న ఉద్యోగులు ఇక విధిగా సమయపాలన పాటించాల్సిందే. ఆఫీసుకు ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం కుదరదు. ఆఫీసు టైమింగ్స్‌‌ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అటెండెన్స్‌‌ను పక్కాగా అమలు చేయాలని, నిబంధనలు అతిక్రమిస్తే సెలవుల్లో కోత పెట్టాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలిచ్చారు.

ఐదింటిదాకా ఉండాల్సిందే..

డైరెక్టరేట్‌‌ ఆఫీసు పనివేళల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ఆధారంగా నెలవారీ హాజరును లెక్కించనున్నారు. దీనికోసం పలు నిబంధనలు పెట్టారు. ఉదయం 10:40 గంటల లోపు కార్యాలయానికి చేరుకోవాలి. ఒకవేళ ఉదయం 10:41 నుంచి 11:30 గంటల మధ్య హాజరు నమోదు చేస్తే దానిని లేటుగా వచ్చినట్లు పరిగణిస్తారు. నెలలో ఇలా మూడు సార్లు ఆలస్యమైతే, ఒక క్యాజువల్‌‌ లీవ్‌‌(సీఎల్‌‌)ను కట్ చేస్తారు.

సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులో ఉండటం తప్పనిసరి. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య లాగౌట్‌‌ చేసినా దానిని ఎర్లీ లాగౌట్‌‌ గా పరిగణించి, ప్రతి మూడుసార్లకు ఒక సీఎల్‌‌ను తగ్గిస్తారు. సాయంత్రం 4 గంటల కంటే ముందే ఆఫీసు నుంచి వెళ్లిపోయినా, లేదా లాగౌట్‌‌ నమోదు చేయకపోయినా ఆఫ్ డే సెలవుగా పరిగణించనున్నారు. ఎంప్లాయీస్‌‌కు సీఎల్‌‌లు లేకపోతే, జిల్లా కార్యాలయ నిబంధనల మేరకు ఈఎల్‌‌ల నుంచి కోత పెడ్తారు.

ఆఫీస్ బయట ఉండి అటెండెన్స్‌‌ వేస్తే ఆబ్సెంట్.. 

ఆఫీసు ప్రాంగణం బయట ఉండి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ వేస్తే దానిని ఆబ్సెంట్‌‌గా పరిగణిస్తామని డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు. ప్రతి నెలా 20వ తేదీకల్లా అటెండెన్స్ నివేదికను అకౌంట్స్ ఆఫీసర్‌‌కు సమర్పించాలని అసిస్టెంట్ డైరెక్టర్లు, సూపరింటెండెంట్లను ఆదేశించారు. ఈ అటెండెన్స్ రిపోర్ట్ ఆధారంగానే నెలవారీ జీతాల బిల్లులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఆఫీసు నిర్వహణను గాడిలో పెట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.