హైదరాబాద్, వెలుగు: పెండింగులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధికి జేఏసీ కృతజ్ఞతలు తెలిపింది.
ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రభుత్వానికి జేఏసీ సమర్పించిన 27 సమస్యల జాబితాను వారు ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేశారు. పీఆర్సీ నివేదికను త్వరితగతిన సమర్పించాలని కమిటీని సీఎం ఆదేశించడం, పెండింగ్ డీఏ బకాయిలు, వేతన పెంపు (ఫిట్‌మెంట్)పై చర్చలకు సిద్ధమవ్వడాన్ని నేతలు స్వాగతించారు.
వచ్చే నెల 1వ తేదీలోపు ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్స్ పంపిణీ చేస్తామన్న హామీపై హర్షం వ్యక్తం చేశారు. పెన్షనర్లకు సంబంధించిన రూ.6 వేల కోట్ల బకాయిలను 100 రోజుల్లో చెల్లిస్తామని సీఎం ప్రకటించడం సానుకూల పరిణామమన్నారు. సీపీఎస్ అంశంపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగుల ప్రమోషన్లలో జాప్యం జరగకుండా డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ప్రక్రియను మరింత సులభతరం చేయాలని జేఏసీ కోరింది.
‘‘జేఏసీ ముందుంచిన 63 డిమాండ్లలో ఇప్పటికే 25 సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన వాటిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని నమ్ముతున్నాం. నిధులతో కూడుకున్నవి, నిధులతో సంబంధం లేని సమస్యల జాబితాను స్పష్టంగా సీఎంకు అందజేశాం’’ అని నేతలు పేర్కొన్నారు. ఉద్యోగులపై ప్రభుత్వం చూపుతున్న స్నేహపూర్వక వైఖరిని కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సహకరించాలని వారు కోరారు.
