ఇది ఈముల దండయాత్ర

ఇది ఈముల దండయాత్ర

ఈ మధ్యే ఆస్ట్రేలియా 5 వేల ఒంటెల్ని చంపేసింది.. గుర్తుంది కదా. నీళ్ల కోసం ఇళ్లపై అవి దాడి చేస్తున్నాయన్న కారణంతో హెలికాప్టర్ల నుంచి కాల్చి చంపించింది. ఇప్పుడు అదే ఆస్ట్రేలియాలోని ఇంకో టౌన్​కు మరో కష్టమొచ్చింది. ఆ టౌన్​పై ఈములు దండెత్తి వస్తున్నాయట. కేవలం 1,300 మంది మాత్రమే ఉండే పశ్చిమ ఆస్ట్రేలియాలోని నానప్​ టౌన్​కు వాటి బెడద ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయట. ఎక్కడపడితే అక్కడ పెంటపెంట చేసేస్తున్నాయట. ఎట్లొచ్చినయో ఏమో తెల్వదుగానీ 40 దాకా ఈము పక్షులు వీధుల్లో తిరుగుతూ హల్​చల్​ చేస్తున్నాయట. ‘‘ఎట్లొచ్చినయో ఏమో గానీ ఈములు టౌన్​లోకి వచ్చాయి. కొన్ని వీధుల్లోనే గుడ్లు పెట్టి పొదిగాయి. అవిప్పుడు పెరిగి పెద్దయ్యాయి. కూరగాయలు, పంటలపై దాడులు చేస్తున్నాయి. వీధుల్లో తిరుగుతూ హల్​చల్​ చేస్తున్నాయి.

టౌన్​లో ఇప్పుడు పండ్లు బాగా పండుతాయి. యాపిల్స్​, పీచ్​లు బాగా పండే కాలం ఇది. వాటికి తోడు కూరగాయల తోటలూ ఎక్కువే ఉన్నాయి. కాబట్టి ఫుడ్​ కోసమే అవి ఇక్కడికి వచ్చి ఉంటాయి’’ అని నానప్​ టౌన్​ కౌన్సిల్​ప్రెసిడెంట్​ టోనీ డీన్​ చెప్పారు. ఇళ్లు, తోటల మీద దాడి చేసి బీభత్సం సృష్టిస్తున్నాయన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయి టౌన్​లో తిరుగుతున్నాయన్నారు. పెద్ద పెద్ద సౌండ్లు చేయడం, హై ప్రెజర్​ పైపులతో స్ప్రే చేయడం వంటి వాటితో ఈములను  చెదరగొడుతున్నామన్నారు. అయితే, వాటిని చెదరగొట్టడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈములను చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైప్రెజర్​ పైపుల ముందు మీ పిల్లలను నిలబెట్టి చూడండి అంటూ మండిపడ్డారు. దానిపై స్పందించిన టౌన్​ పోలీసులు, ఈములను ఏం చంపట్లేదని స్పష్టం చేశారు. వాటి వల్ల డేంజర్​ ఏం లేదని, కాకపోతే ట్రాఫిక్​కు ఇబ్బందులు కలిగిస్తాయని అన్నారు.