పోలవరంలో నీళ్లు నిల్వ చేయొద్దు.. ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ

పోలవరంలో నీళ్లు నిల్వ చేయొద్దు.. ప్రాజెక్టు అథారిటీకి తెలంగాణ లేఖ

హైదరాబాద్, వెలుగు: పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేయొద్దని ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్​సోమవారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవోకు లేఖ రాశారు. ఆ ప్రాజెక్టు బ్యాక్​వాటర్​తో భద్రాచలంతోపాటు తమ భూభాగంలో ముంపు తలెత్తకుండా ప్రాజెక్టు గేట్లతో పాటు రివర్​ స్లూయిజ్​లు తెరిచే ఉంచాలని లేఖలో డిమాండ్​ చేశారు. నిరుడు పోలవరం గేట్లు మూసి ఉంచడంతో భద్రాచలం టౌన్​తో పాటు తమ రాష్ట్రంలో 28 వేల ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే ఆ ప్రభావం ఎంతమేర పడుతుందనే దానిపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని 2016లోనే తాము విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. తెలంగాణ, ఒడిశా, చత్తీస్​గఢ్​ సుప్రీంకోర్టును ఆశ్రయించగా దీనిపై స్టడీ చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు నిరుడు సెప్టెంబర్​6న ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. దీనిపై జలశక్తి శాఖ సెక్రటరీల స్థాయిలో ఒక సమావేశం, టెక్నికల్​ఆఫీసర్ల స్థాయిలో మూడు మీటింగ్​లు, కేవలం తెలంగాణ, ఏపీ మధ్యనే రెండు కో ఆర్డినేషన్​ మీటింగ్​లు కూడా నిర్వహించారని తెలిపారు.

పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసినప్పుడు దుమ్ముగూడెం ఆనికట్​వరకు బ్యాక్​వాటర్​ను​ స్టడీ చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్​ సైతం సూచించారని తెలిపారు. సారపాక ఐటీసీ, మణుగూరు హెవీ వాటర్​ప్లాంట్, భద్రాచలం పట్టణంతో పాటు వాగులపై బ్యాక్​వాటర్​ఎఫెక్ట్​పై జాయింట్​సర్వే చేయాలని కూడా ఆదేశాలిచ్చారని తెలిపారు. నిర్దేశిత సమయంలోగా బ్యాక్ వాటర్​ ప్రభావంపై స్టడీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేస్తే తెలంగాణలో ముంపు వాటిల్లకుండా ఈ వానాకాలం మొత్తం.. పోలవరం 48 గేట్లు, రివర్​స్లూయిజ్​లు తెరిచే ఉంచాలని విజ్ఞప్తి చేశారు.