జమ్మూ కాశ్మీర్​లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు లష్కరే టెర్రరిస్టులు హతం

జమ్మూ కాశ్మీర్​లో ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు లష్కరే  టెర్రరిస్టులు హతం

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పోలీసులు, ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఐదుగురు లష్కరే తయిబా (ఎల్‌ఈటీ)టెర్రరిస్టులు హతమయ్యారు. గురువారం ఉదయం కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్‌లో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. తొలుత ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని, ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. కాగా, ఆర్మీ ప్రత్యేకంగా చేపట్టిన కౌంటర్ ఇన్‌ఫిల్ట్రేషన్ ఆపరేషన్‌లలో స్థానిక పోలీసులను కూడా వినియోగిస్తున్నారు. 

నియంత్రణ రేఖ వెంబడి 16 టెర్రరిస్టు లాంచింగ్ ప్యాడ్‌లు ఇప్పటికీ పనిచేస్తున్నాయని  జమ్మూ కాశ్మీర్‌ పోలీస్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. కాగా, బుధవారం శ్రీనగర్‌లోని 15 కోర్ హెడ్​ ఆఫీస్​లో జమ్మూ కాశ్మీర్ ఉన్నతాధికారులు, భద్రతా సంస్థల సమావేశం జరిగింది. కాశ్మీర్‌లో విదేశీ టెర్రరిస్టుల పాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. స్థానికంగా రిక్రూట్‌మెంట్లు తగ్గిపోవడంతో విదేశీ టెర్రరిస్టుల సంఖ్య మళ్లీ పెరిగిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఏడాది జమ్మూకాశ్మీర్​​లో హతమైన 46 మంది టెర్రరిస్టుల్లో 37 మంది పాకిస్తానీలు కాగా.. మిగతా వారు స్థానికులని పేర్కొన్నారు.