
- ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా..
భద్రాచలం, వెలుగు: జార్ఖండ్‌లోని బోకారో జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు, ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ మృతి చెందారు. గోనియా ఏరియాలోని బిర్హోర్డెరా అడవిలో తెల్లవారుజామున 5:30 గంటలకు సీఆర్‌పీఎఫ్ బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. అక్కడ మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం ఆధారంగా బోకారో జోన్ రేంజ్ ఐజీ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఎస్పీ హర్విందర్ సింగ్ నేతృత్వంలో సీఆర్‌పీఎఫ్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి.
భద్రతా బలగాలను చూసిన మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులను భద్రతా బలగాలు కాల్చిచంపాయి. ఈ కాల్పుల్లో సీఆర్‌పీఎఫ్ జవాన్ కూడా మృతి చెందారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఒక ఏకే-47 రైఫిల్‌తో పాటు మావోయిస్టుల విప్లవ సాహిత్యం, పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులను స్వాధీనం చేసుకుని బోకారో జిల్లా కేంద్రానికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతి చెందిన మావోయిస్టులను గుర్తించే ప్రాసెస్ జరుగుతోందని పేర్కొన్నారు.