
జాతీయ స్థాయి గేమ్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించిన స్టూడెంట్లకు అభినందనలు
హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయి ఆటల పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన స్టూడెంట్లను కాకా బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థల చైర్మన్ వివేక్ వెంకటస్వామి, కరస్పాండెంట్ సరోజా వివేక్ అభినందించారు. బుధవారం బాగ్ లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ సరోజా వివేక్ మాట్లాడుతూ.. పేద స్టూడెంట్ల కోసం కాకా వెంకటస్వామి స్థాపించిన అంబేద్కర్ విద్యాసంస్థలు 49 ఏండ్లు పూర్తి చేసుకొని 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. కాకా కలలను అంబేద్కర్ విద్యాసంస్థలు ముందుకు తీసుకెళ్తున్నాయని చెప్పారు.
పేద స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడంతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ‘ పదో తరగతి ఫలితాల్లో అంబేద్కర్ కాలేజీ వాచ్‌మన్ కూతురు టాపర్‌గా నిలిచింది. ఇంటర్లో నాలుగు స్టేట్ ర్యాంకులు, ఎల్‌ఎల్‌ఎం ఎంట్రెన్స్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంబేద్కర్ విద్యాసంస్థల స్టూడెంట్లకే వచ్చాయి. డిగ్రీ స్టూడెంట్ మిథిలేశ్ కరాటేలో, ఎల్‌ఎల్‌బీ లెక్చరర్ విఘ్నేయానంద్ ఆర్చరీలో గోల్డ్ మెడల్స్ సాధించారు. ఇదే విధంగా స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ఆటల్లోనూ ప్రోత్సహిస్తాం. రాబోయే రోజుల్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని సరోజా వివేక్ తెలిపారు.