ట్రంప్ బెదిరింపులు..37 ఏండ్ల సంప్రదాయానికి బ్రేక్

ట్రంప్ బెదిరింపులు..37 ఏండ్ల సంప్రదాయానికి బ్రేక్
  • ఎయిర్​ఫోర్స్ కమాండర్ల భేటీకి ఖమేనీ గైర్హాజరు

టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  బెదిరింపులకు ఇరాన్  సుప్రీం లీడర్  అయతొల్లా ఖమేనీ తలొగ్గారు. ఈనెల 8న ఎయిర్ ఫోర్స్  కమాండర్లతో జరిగిన సమావేశానికి ఖమేనీ హాజరుకాలేదు. దీంతో 37 ఏండ్ల సంప్రదాయాన్ని ఆయన బ్రేక్  చేసినట్లయింది. 1989లో ఇరాన్  సుప్రీం లీడర్​గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎయిర్ ఫోర్స్ కమాండర్లతో జరిగిన సమావేశాలకు ఆయన హాజరవుతూ వచ్చారు.

కొవిడ్  సమయంలోనూ ఆ సమావేశంలో పాల్గొన్నారు. కానీ, ఈసారి ఆ ఈవెంట్​కు హాజరుకాకుండా 37 ఏండ్ల సంప్రదాయాన్ని బ్రేక్  చేశారు. పహ్లవీ వంశాన్ని గద్దెదింపడానికి 1979 ఫిబ్రవరి 8న ఎయిర్ ఫోర్స్  ఆఫీసర్ల గ్రూప్.. రుహొల్లా ఖొమీనేకి విధేయత ప్రకటించింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని 1989 నుంచి ఏటా ఫిబ్రవరి 8న ఎయిర్ ఫోర్స్ కమాండర్ల భేటీ జరుగుతుంది.

తర్వాత అయతొల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్  అయ్యారు. ఇస్లామిక్  రిపబ్లిక్​ను కూడా స్థాపించారు. ఈ నెల 8న జరిగిన సమావేశంలో ఖమేనీకి బదులు సాయుధ బలగాల చీఫ్​ ఆఫ్  స్టాఫ్  అబ్దుల్ రహీం పాల్గొన్నారని ఇరాన్  మీడియా వెల్లడించింది.

అమెరికా, ఇరాన్  మధ్య ఉద్రిక్తతల వల్లే..

అమెరికా, ఇరాన్  మధ్య గత కొద్ది నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగానే ఎయిర్ ఫోర్స్  కమాండర్ల భేటీకి ఖమేనీ హాజరు కాలేదని సమాచారం. ఇరాన్ లో అమెరికా తన మిలిటరీని మరింత విస్తరించడంతో ఎక్కడ దాడులు చేస్తుందోనని ఇరాన్  ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో కమాండర్ల భేటీకి హాజరైతే ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చని ఖమేనీ భావించి ఉండవచ్చని చర్చ జరుగుతోంది. కాగా.. తమపై అమెరికా దాడిచేస్తే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు తప్పవని ఇరాన్  ఇదివరకే హెచ్చరించింది.