దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత.. ఒక్కో ఈవోకు 8 నుంచి 10 టెంపుల్స్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ బాధ్యతలు

 దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత..  ఒక్కో ఈవోకు 8 నుంచి 10 టెంపుల్స్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ బాధ్యతలు
  • 233 మంది ఈవోలకు ఉన్నది 164 మందే  
  • 127 మందికి గాను 67 మందే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు   
  • కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో కీలకమైన ల్యాండ్ సెక్షన్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్ పోస్టు గత మూడేండ్లుగా ఖాళీ 

హైదరాబాద్, వెలుగు: దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తున్నది. ఆలయాల్లో సౌకర్యాల కల్పన, అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఈవోలు, పర్యవేక్షణ సిబ్బంది లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దేవాదాయ శాఖ పరిధిలో 704 ఆలయాలు ఉండగా, నిబంధనల ప్రకారం 233 మంది ఈవోలు ఉండాలి. కానీ  164 మంది ఈవోలు మాత్రమే పని చేస్తున్నారు. ఇంకా 69 ఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ హయాంలోనే దేవాదాయ శాఖలో ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు.

 ఆ ఖాళీలకు సంబంధించిన వివరాలను దేవాదాయ శాఖ.. నాటి ప్రభుత్వానికి నివేదించినా భర్తీ చేయలేదు. దీంతో ఆలయాలపై పర్యవేక్షణ కొరవడింది. ఒక్కొక్క ఈవోకు 8 నుంచి 10 టెంపుల్స్​ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు అప్పగించారు. దీంతో వాళ్లు పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోతున్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. ఆలయ భూములు కబ్జాకు గురవుతున్నా రక్షించలేకపోతున్నారు.  

ఖాళీలపై కొరవడిన స్పష్టత.. 

దేవాదాయ శాఖలో ఖాళీ పోస్టుల వివరాలపై స్పష్టత లేకుండా పోయింది. అసలు ఈ శాఖలో మొత్తం ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు? ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే విషయంలో అధికారుల్లో క్లారిటీ లేదు. అసిస్టెంట్ కమిషనర్లు 27 మందికి గాను 13 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 14 ఖాళీలు ఉండగా,4 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పరిధిలో భర్తీ చేయాలని నివేదికలో ఉంది.  గ్రేడ్-1 ఎగ్జిక్యూటివ్  ఆఫీసర్లు 39 పోస్టులకు గాను 33 మంది పనిచేస్తున్నారు. 6 ఖాళీలు ఉండగా, వీటిలో 5 డైరెక్ట్ రిక్రూట్ మెంట్ పరిధిలో ఉన్నాయి. గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు 127 పోస్టులకు 67  మంది మాత్రమే పనిచేస్తున్నారు. 60 ఖాళీలు ఉండగా, వీటిలో 54 పోస్టులు డైరెక్ట్  రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. జూనియర్ అసిస్టెంట్లు 16 మందికి గాను ముగ్గురు మాత్రమే ఉన్నారు.  

డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై వచ్చి కమిషనర్ ఆఫీసులో తిష్ట.. 

రాష్ట్రంలోని పలు దేవాదాయ శాఖ కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది.. డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై వచ్చి కమిషనర్ ఆఫీసులో తిష్ట వేశారు. ఒక ఏడాది పర్మిషన్‌‌‌‌‌‌‌‌తో వచ్చిన ఉద్యోగులు.. ఏండ్లుగా ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా సుమారు 25 మంది వరకు ఉద్యోగులు డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై కొనసాగుతున్నారు. దీంతో ఇతర ఉద్యోగులకు ప్రమోషన్ల విషయంలో నష్టం జరుగుతున్నది. అంతేకాకుండా హెడ్​ఆఫీసులో డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌పై కొనసాగుతున్న పోస్టును ఖాళీగా చూపించలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు మాతృసంస్థ పోస్టులో కొత్తవారిని తీసుకోలేకపోతున్నారు. అలాగే ఆ పోస్టును కూడా ఖాళీగా చూపించలేరు. పైగా ప్రమోషన్లలో ఆ పోస్టును భర్తీ చేయడం లేదు.

సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌నూ నియమిస్తలే.. 

దేవాదాయ శాఖ  కమిషనర్ కార్యాలయంలో అత్యంత కీలకమైన భూముల విభాగం (ల్యాండ్  ప్రొటెక్షన్​సెల్) లో మూడేండ్లుగా సూపరింటెండెంట్ పోస్టు ఖాళీగా ఉంది. ఈ సెక్షన్ వ్యవహారాలపై పర్యవేక్షణ లేకపోవడంతో ఆలయ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. ప్రభుత్వాలు, కమిషనర్లు మారినా.. ఈ సెక్షన్‌‌‌‌‌‌‌‌కు మాత్రం పర్మనెంట్​సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ను నియమించడం లేదు. ప్రస్తుతం ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్‌‌‌‌‌‌‌‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, నలుగురు తహసీల్దార్లు మాత్రమే పని చేస్తున్నారు. వీరు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడలేకపోతున్నారు. 

2023 ఫిబ్రవరిలో అప్పటి సూపరింటెండెంట్ ఆరోగ్యరీత్యా మెడికల్ లీవ్‌‌‌‌‌‌‌‌పై వెళ్లారు. అప్పటి నుంచి రెగ్యులర్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ను నియమించలేదు. ఆయన మళ్లీ జాయిన్ అయినా.. అకౌంట్స్ సెక్షన్‌‌‌‌‌‌‌‌కు మార్చారు. ఎలక్షన్‌‌‌‌‌‌‌‌కు ముందు సీజీఎఫ్​సెక్షన్  సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ను ఇన్‌‌‌‌‌‌‌‌చార్జిగా నియమించినా, ఆయన మూడు నెలలు ఎలక్షన్ డ్యూటీలోనే ఉన్నారు. మళ్లీ జాయినైనా సెక్షన్ వైపు చూడలేదు. గత ఎన్నికల ముందు ఒక జూనియర్ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ని ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌గా పెట్టినా.. ఆయన వారం లోపే ఎలక్షన్ డ్యూటికి వెళ్లి తిరిగొచ్చినా.. ఆ తర్వాత తప్పించారు. అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. గత ఆగస్టులో సూపరింటెండెంట్లను మారుస్తూ ఆర్డర్స్ ఇచ్చినా..  ఖాళీగా ఉన్న ల్యాండ్​సెక్షన్‌‌‌‌‌‌‌‌కి మాత్రం ఎవరినీ నియమించలేదు. ఆ సెక్షన్‌‌‌‌‌‌‌‌లోనే నెలకొక జూనియర్ అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ను మారుస్తూ .. అదీ తాత్కాలిక పద్ధతిలో పని చేయిస్తున్నారు.