దేవాదాయశాఖలో అడిషనల్ కమిషనర్లకు బాధ్యతల పంపిణీ : సెక్రటరీ శైలజా రామయ్యర్

దేవాదాయశాఖలో అడిషనల్ కమిషనర్లకు బాధ్యతల పంపిణీ : సెక్రటరీ శైలజా రామయ్యర్
  •     భూములు, విజిలెన్స్ శ్రీనివాస్ రావుకు సీజీఎఫ్, అకౌంట్స్ కృష్ణవేణికి
  •     పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆర్డర్స్

హైదరాబాద్, వెలుగు: దేవాదాయశాఖ డైరెక్టరేట్‌‌లో పనిచేస్తున్న అడిషనల్ కమిషనర్ల మధ్య పని విభజన (సబ్జెక్ట్స్ అలోకేషన్) చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయశాఖ మంత్రి ఆదేశాల మేరకు గతంలో ఉన్న ఉత్తర్వులన్నింటిని రద్దు చేస్తూ ఇద్దరు అడిషనల్ కమిషనర్లకు కొత్త బాధ్యతలను అప్పగిస్తూ రెవెన్యూ (ఎండోమెంట్స్) ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆర్డర్ నెంబర్ 04ను విడుదల చేశారు. దీని ప్రకారం తక్షణమే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. 

ఇకపై అత్యంత కీలకమైన భూముల వ్యవహారాలు, విజిలెన్స్ విభాగాలు అడిషనల్ కమిషనర్-–I  శ్రీనివాస్ రావు పరిధిలోకే రానున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్, పెన్షన్ మ్యాటర్స్, ఉమ్మడి వరంగల్ జోన్ (మల్టీ జోన్–-1) పరిధిలోని ఆలయాలు, ఉద్యోగుల సర్వీస్, పరిపాలన వ్యవహారాలు, ఉమ్మడి హైదరాబాద్ జోన్ (మల్టీ జోన్–-2) పరిధిలోని ఆలయాలు, సిబ్బంది, భూముల (స్థిరాస్తుల) వ్యవహారాలు, ప్రభుత్వ ఉద్యోగుల డిసిప్లినరీ మ్యాటర్స్ (విజిలెన్స్) ఆయన పరిధిలోకి రానున్నాయి. 

అడిషనల్ కమిషనర్–-II  ఎంఎండీ కృష్ణవేణికి కామన్ గుడ్ ఫండ్, ట్రస్ట్ బోర్డుల నియామకం వంటి అంశాలు కేటాయించారు.  అకౌంట్స్,  కామన్ గుడ్ ఫండ్, అర్చక వెల్ఫేర్, ధూప దీప నైవేద్యం, ట్రస్ట్ బోర్డులు, రినోవేషన్ కమిటీల వ్యవహారాలు,  సమాచార హక్కు చట్టం, ఆడిట్, ఇన్‌‌ వార్డ్-అవుట్‌‌వార్డ్ కరస్పాండెన్స్, పనులు (మాస్టర్ ప్లాన్స్),  సాలరీస్ గ్రాంట్-ఇన్- ఎయిడ్, సంబంధిత చట్టపరమైన అంశాలు ఆమె పరిధిలోకి రానున్నాయి.