
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారణ ముగిసింది. వరుసగా మూడో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఆమెను విచారించారు. మోడీ సర్కార్ తమ పార్టీ నేతలపై కక్ష సాధిస్తోందని కాంగ్రెస్ లీడర్స్ ఆందోళన చేశారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు సోనియా హాజరవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం మూడు గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. మూడు రోజుల్లో ఆమెను 100కు పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అయితే అధికారులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ చెప్పిన సమాధానాలే సోనియా చెప్పినట్టు తెలుస్తోంది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్, యంగ్ ఇండియా లావాదేవీలను దివంగత నేత మోతీలాల్ వోరాయే చూసుకున్నారని ఆమె ఆన్సర్ చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు సోనియాగాంధీపై ఈడీ విచారణను నిరసిస్తూ.. పార్లమెంటులోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీ నిర్వహించారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయవద్దని నినాదాలు చేశారు. విజయ్ చౌక్ దగ్గర కాంగ్రెస్ నేతలు, భద్రతాబలగాల మధ్య ఘర్షణ జరిగింది. ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ ఎంపీలు, నేతలను ఢిల్లీ కింగ్స్ వే క్యాంప్ లోని పోలీస్ డిటెన్షన్ సెంటర్ లో ఉంచారు. అయితే అక్కడే నేతలు పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఈడీ విచారణ, ధరల పెరుగుదల, అగ్నిపథ్, దేశభద్రత, రూపాయి పతనంపై నేతలు చర్చించారు. భవిష్యత్ కార్యాచరణపై డిస్కస్ చేశారు. మోడీ సర్కారు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. మరోవైపు ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.