
న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ సిరీస్ నుంచి ఔట్ అయ్యాడు. గాయం కారణంగా సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్ట్‌కు పంత్ దూరమైనట్లు బీసీసీఐ అఫిషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్ సందర్భంగా రిషబ్ పంత్ గాయపడ్డాడు. పంత్ కుడి పాదం ఫ్రాక్చర్ కావడంతో సిరీస్ చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు.
బీసీసీఐ వైద్య బృందం అతని పురోగతిని పర్యవేక్షిస్తుంది. పంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం’’ అని బీసీసీఐ పేర్కొంది. కాగా పంత్ స్థానాన్ని తమిళనాడు వికెట్ కీపర్ జగదీశన్‌తో భర్తీ చేసినట్లు బీసీసీఐ తెలిపింది. ది ఓవల్ వేదికగా జరగనున్న చివరి టెస్టులో పంత్ స్థానంలో జగదీశన్‌ను సెలక్ట్ చేసింది బీసీసీఐ.
కాగా, మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రిషబ్ పంత్ గాయపడిన విషయం తెలిసిందే. నాల్గవ టెస్ట్ మొదటి రోజు ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించగా బంతి పంత్ కుడి పాదానికి బలంగా తగిలింది. దీంతో పంత్ కాలు వాయడంతో పాటు రక్తం కారింది. నొప్పితో అల్లాడిపోయిన పంత్ రిటైర్డ్ హట్‌గా వెనుదిరిగాడు. పంత్ గాయం తీవ్రత చూసిన తర్వాత అతడు ఇక బ్యాటింగ్‌కు రావడం కష్టమే అనుకున్నారంతా.
ALSO READ : టీమిండియా వీరోచిత పోరాటం.. నాలుగో టెస్టులో తప్పిన ఓటమి
కానీ జట్టు కష్టాల్లో ఉండటంతో గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఓ పోరాట యోధుడిలా తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు పంత్. కాలు ఫ్రాక్చర్ కావడంతో తిరిగి కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో పంత్ చివరి టెస్టుకు దూరమయ్యాడు. ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పంత్ భారత్‌కు కీలకమైన ఐదో టెస్టుకు దూరం కావడం టీమిండియాకు ఎదురు దెబ్బనేనని అంటున్నారు క్రీడా విశ్లేషకులు.