తీరొక్క పూలతో రోజొక్క తీరుగా తొమ్మిదిరోజులు బతుకమ్మను పేర్చి, ఆడి పాడే మన తెలంగాణ ఆడబిడ్డల సంబురాలకు యాళ్లయింది. ‘ఎంగిలిపూల బతుకమ్మ’తో ఐతారం నుంచి గల్లీ గల్లీలో పూల జాతర షురూ కానుంది. ‘ఒక్కేసి పువ్వేసి చందమామ.. ఒక్క జాములాయె చందమామ’ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ వంటి పాటలతో, ఆటలతో ముంగిళ్లలో పూలసింగిడి విరబూయనుంది. ఇయ్యాల పెత్రామాస నుంచి వచ్చే నెల 3 వరకు బతుకమ్మ పండుగతో తెలంగాణ ఉయ్యాలలూగనుంది. తెలంగాణ వాడవాడలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. బతుకమ్మతో తెలంగాణ పల్లెలు కొత్త శోభ సంతరించుకోనున్నాయి.
ప్రపంచంలో ఎక్కడా లేని పూల పూజ మన సంస్కృతికి ప్రతిబింబం. గౌరీదేవి పండుగకు.. బతుకమ్మలను తీర్చిదిద్దే పనిలో ఉన్నారు తెలంగాణ ఆడపడచులు. ఇవాళ్టి నుంచి 9 రోజులపాటు.. తెలంగాణ వాడవాడలా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. బతుకమ్మతో తెలంగాణ పల్లెలు కొత్త శోభ సంతరించుకోనున్నాయి.
పూలనే దేవతగా కొలిచే అపురూప పండగ బతుకమ్మ..తీరొక్క పూవులతో బతుకమ్మ పేర్చి.. ఆడపడుచులంతా ఒక్కచోట చేరితమ అనుభవాలనే పాటగా మలిచి..చప్పట్లతో గౌరమ్మను కొలిచే పండుగ. ఇది మట్టి మనుషుల పండుగ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. మన అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి.. చల్లంగ చూడమ్మా అని గౌరీదేవిని వేడుకునే అతిపెద్ద పూల పండుగ.
ప్రకృతిని ఆరాధిస్తూ.. పుడమితల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. అందరినీ బతుకమనీ,అందరికీ బ్రతుకునివ్వమనీ కోరుకొనే తెలంగాణ సాంస్కృతిక మహోత్సవం మన బతుకమ్మ. ఆడపడుచులంతా బంధాలను, అనుబంధాలను గుర్తుచేస్తూ, ప్రకృతిని ఆరాధిస్తూ సంబురంగా పాటలు పాడుతూ జరుపుకొనే అరుదైన వేడుక.
బతుకమ్మ సంబరాలు ఏటా పెత్తర అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలవుతుంది. ఈ ప్రకృతి పండగకు తెలంగాణ పల్లెలు సిద్ధమయ్యాయి. తొమ్మిది రోజులపాటు తెలంగాణ ఆడపడుచులు.. రోజుకో రూపంలో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలుస్తారు. ఇవాళ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ పూల పండుగ.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది.
ప్రకృతి సహజసిద్ధంగా లభించే పూలతో కూడిన అమరిక బతుకమ్మ. బతుకమ్మను పేర్చే పూలలో ఎంతో విశేషం ఉంది. ఔషధ గుణాలున్న పువ్వులను బతుకమ్మలను పేర్చేందుకు ఉపయోగిస్తారు. తంగేడు, బంతి, చేమంతి, గునుగు, కట్ల, సంపెంగ, సీతజడలు,పోకబంతి, మందార, తామెర, గన్నేరు, గుమ్మడి పూలతోపాటు.. చెలకల్లో దొరికే నూకలిపూవును రంగుల్లో అద్ది బతుకమ్మలను అందంగా తీర్చిదిద్దుతారు. కూడళ్లలో బతుకమ్మలను ఉంచి మహిళలు, యువతులు, చిన్నారులంతా భక్తిశ్రద్ధలతో.. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపదాలను పడుతూ పండుగ జరుపుకొంటారు.
బతుకమ్మ పండుగలో పాటలకు ఎంతో విశిష్టత ఉంది. నాటి నిజాం ఏలుబడిలో మట్టిమనుషుల వెట్టిచాకిరి మనకు బతుకమ్మలో కనిపిస్తాయి. ఆడపిల్ల బాధలతో అల్లిన పాటలు..అందర్నీ ఇట్టే కట్టిపడేస్తాయి. మనకు తెలంగాణ జీవనచిత్రం కనిపిస్తుంది. మన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తెలిపేలా బతుకమ్మ పాటలను పాడతారు మహిళలు. ఇవేకాక పురాణాలు, ఇతిహాస కథలు, తెలంగాణ వీరుల గాధలు తెలిపేలా బతుకమ్మ పాటలుంటాయి. చిన్నాపెద్దా వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేలా చేస్తాయి.
తొమ్మిది రోజులు జరుపుకొనే ఈ పండగ సందర్భంగా ప్రతిరోజూ ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. పెత్రామాస రోజు జరుపుకొనే ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా.. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం సమర్పిస్తారు.
రెండోరోజు అటుకుల బతుకమ్మ.. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ సందర్భంగా.. ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు. నాల్గవరోజు నాన బియ్యం బతుకమ్మకు.. నానబెట్టిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఐదోరోజు అట్ల బతుకమ్మకు.. అట్లు లేదా దోశలను నైవేద్యంగా పెడతారు. ఆరోరోజు అలిగిన బతుకమ్మ.. ఈరోజు ఎలాంటి నైవేద్యం సమర్పించరు. ఏడోరోజు వేపకాయల బతుకమ్మకు.. బియ్యం పిండిని వేయించి.. వేపపండ్లుగా తయారు చేసి సమర్పిస్తారు ఆడపడుచులు.
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మకు.. నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు. తొమ్మిదో రోజు అశ్వయుజ అష్టమి నాడు సద్దుల బతుకమ్మను గ్రాండ్ గా జరుపుతారు మహిళలు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం.. ఇలా ఐదురకాలు చేసి నైవేద్యంగా నివేదిస్తారు.
తొమ్మిది రోజులపాటు బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో పూజించే మహిళలు.. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మలో కలుపుతారు. గౌరమ్మా చల్లంగ చూడమ్మా అని వేడుకుంటారు. ఇక సొంతూళ్లలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పండుగ జరుపుకునేందుకు ఇప్పటికే పిల్లాపాపలతో పల్లెబాట పట్టారు సిటీ జనం. తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన ఈ పండుగను.. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది ప్రభుత్వం.
