IND vs ENG 2025: జడేజా శ్రమ వృధా.. లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన టీమిండియా

IND vs ENG 2025: జడేజా శ్రమ వృధా.. లార్డ్స్ టెస్టులో పోరాడి ఓడిన టీమిండియా

ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా పోరాడి ఓడిపోయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో చివరి వరకు జడేజా (61) పోరాడినా భారత్ కు విజయం దక్కలేదు. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక 170 పరుగులకే ఆలౌట్ అయింది. మరోవైపు చివరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ తలో మూడో వికెట్లు తీసుకున్నాడు. కార్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్, బషీర్  కు చెరో వికెట్ దక్కింది. ఈ విజయంతో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్ట్ మాంచెస్టర్ లో జూలై 23 న జరుగుతుంది. 

4 వికెట్ల నష్టానికి 58 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు వరుస షాక్ లు తగిలాయి. తొలి గంట లోపే మూడు కీలక వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో నిలిచింది. మొదట పంత్ (9) ఔట్ కాగా.. ఆ తర్వాత వరుసగా రాహుల్, సుందర్ పెవిలియన్ కు క్యూ కట్టారు. 21 ఓవర్ ఐదో బంతికి ఆర్చర్ ఇన్ స్వింగ్ తో పంత్ ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే స్టోక్స్ ఒక అద్భుతమైన ఇన్ స్వింగ్ డెలివరీతో రాహుల్ (39) ను ఔట్ చేయగా.. ఆర్చర్ బౌలింగ్ లో సుందర్ (0) రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లంచ్ కు ముందు వోక్స్ నితీష్ (13) ను ఔట్ చేసి ఇంగ్లాండ్ విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. 

8 వికెట్ల నష్టానికి 112 పరుగులతో లంచ్ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాను జడేజా, బుమ్రా భాగస్వామ్యం నిలబెట్టింది. వీరిద్దరూ దాదాపు 21 ఓవరాల్ పాటు ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించి 35 పరుగుల విలువైన పరుగులు జోడించారు. జట్టు విజయానికి 46 పరుగులు కావాల్సిన దశలో స్టోక్స్ బౌలింగ్ లో పుల్ షాట్ కు ప్రయత్నించి బుమ్రా ఔటయ్యాడు. దీంతో భారత జట్టు 9 వికెట్ కోల్పోయింది. సిరాజ్ తో కలిసి చివర్లో అసాధారణంగా పోరాడిన జడేజా 23 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పోయినా చివరికి బషీర్ బౌలింగ్ లో సిరాజ్ బౌల్డయ్యాడు. దీంతో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది.

►ALSO READ | IND vs ENG 2025: జడేజా అసాధారణ పోరాటం: టీమిండియాకు 30 పరుగులు.. ఇంగ్లాండ్‌కు ఒక్క వికెట్

అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌట అయింది. రూట్ (100) సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు, బుమ్రా 5 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. రాహుల్ సెంచరీ చేసి ఇండియాను ఆదుకున్నాడు. భారత బౌలర్లు విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది.