FIFA World Cup: అదరగొట్టిన ఇంగ్లండ్.. క్రొయేషియాపై ఈజీ విన్

FIFA World Cup: అదరగొట్టిన ఇంగ్లండ్.. క్రొయేషియాపై ఈజీ విన్

ఆర్లింగ్టన్‌‌: ఫిఫా వరల్డ్‌‌ కప్‌‌లో ఇంగ్లండ్‌‌ అదరగొట్టింది. గురువారం జరిగిన గ్రూప్‌‌–ఎల్‌‌ మ్యాచ్‌‌లో 4–2 తేడాతో క్రొయేషియాపై ఈజీగా విజయం సాధించింది. ఇంగ్లిష్‌‌ జట్టుకు కెప్టెన్‌‌ హ్యారీ కేన్‌‌ (12, 42వ ని), జూడ్‌‌ బెల్లింగ్‌‌హామ్‌‌ (47వ ని), మార్కస్‌‌ రాష్‌‌ఫోర్డ్‌‌ (85వ ని) గోల్స్‌‌ అందించారు.

మార్టిన్‌‌ బటురినా (36వ ని), పీటర్‌‌ ముసా (45+5వ ని) క్రొయేషియా తరఫున గోల్స్‌‌ కొట్టారు. ఈ మ్యాచ్‌‌లో రెండు గోల్స్‌‌ చేసిన హ్యారీ కేన్‌‌.. వరల్డ్‌‌ కప్‌‌లో అత్యధిక గోల్స్‌‌ చేసిన ఇంగ్లిష్‌‌ ప్లేయర్‌‌ గ్యారీ లీనేకర్‌‌ (10) రికార్డును సమం చేశాడు. 1986, 1990 వరల్డ్ కప్స్‌‌లో లీనేకర్‌‌ ఈ రికార్డును సాధించాడు. అలాగే 32 ఏళ్ల హ్యారీ అంతర్జాతీయ కెరీర్‌‌లో 81వ గోల్‌‌ పూర్తి చేసుకున్నాడు. 2018 సెమీఫైనల్‌‌ ప్రత్యర్థుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌‌ ఆరంభం నుంచే ఉత్కంఠగా సాగింది.

క్రొయేషియా తరఫున ఐదో వరల్డ్‌‌ కప్‌‌ ఆడుతున్న 40 ఏళ్ల లుకా మోడ్రిచ్‌‌ చేసిన చిన్న పొరపాటు ఇంగ్లండ్‌‌కు పెనాల్టీ లభించేలా చేసింది. దీన్ని హ్యారీ గోల్‌‌గా మలిచాడు. ఆ తర్వాత హెడర్‌‌తో రెండో గోల్‌‌ సాధించాడు. దీన్ని త్వరగానే తేరుకున్న క్రొయేషియా ప్లేయర్లు మార్టిన్‌‌, ముసా చెరో గోల్‌‌ చేయడంతో తొలి హాఫ్‌‌ 2–2తో ముగిసింది. 

సెకండాఫ్‌‌లో ఇంగ్లండ్‌‌ మరింత జోరు చూపెట్టింది. కోచ్‌‌ థామస్‌‌ తుషెల్‌‌ ఇచ్చిన స్ఫూర్తితో ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. క్రొయేషియా డిఫెన్స్‌‌ తప్పిస్తూ బెల్లింగహామ్‌‌ కొట్టిన క్రాస్‌‌ షాట్‌‌ గోల్‌‌ పోస్ట్‌‌ను ఛేదించింది. ఆట చివర్లో మార్కస్‌‌ కొట్టిన మరో షాట్‌‌ను క్రొయేషియా గోల్‌‌ కీపర్‌‌ ఆపలేకపోయాడు.