IND vs ENG 2025: ఇంగ్లాండ్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఫైన్‌తో పాటు WTC పాయింట్స్ కట్

IND vs ENG 2025: ఇంగ్లాండ్‌కు దెబ్బ మీద దెబ్బ.. ఫైన్‌తో పాటు WTC పాయింట్స్ కట్

టీమిండియాపై లార్డ్స్ టెస్టులో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. ఇండియాతో లార్డ్స్ వేదికగా ఇటీవలే ముగిసిన మూడో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ కు ఐసీసీ 10 శాతం జరిమానా విధించింది. జరిమానాతో పాటుగా 2025-27 స్టాండింగ్స్‌లో రెండు ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లను ఇంగ్లాండ్ కోల్పోయింది. దీంతో లార్డ్స్ టెస్టులో గెలిచినా ఇంగ్లాండ్ కు ఐసీసీ వరుస షాకులు ఇచ్చింది. లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 10 నిమిషాల పాట (రెండు ఓవర్లు ఆలస్యం) ఆలస్యం అయినట్టు.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ నేరానికి పాల్పడినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రూల్స్ లో భాగంగా ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక జట్టుకు ప్రతి తక్కువ ఓవర్‌కు ఒక పాయింట్ జరిమానా విధించబడుతుంది. ఇంగ్లాండ్ రెండు ఓవర్లు ఆలస్యం వేసిన కారణంగా రెండు పాయింట్లలో కొత్త విధించారు. పాయింట్లు కట్ చేయడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ స్టాండింగ్స్‌లో ఇంగ్లాండ్ 24 నుండి 22కి పడిపోయింది. దీంతో వారి పాయింట్ల శాతం 66.67% నుండి 61.11%కి తగ్గింది. ఆస్ట్రేలియా తర్వాత పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండే ఛాన్స్ కోల్పోయింది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా టాప్ లో ఉంది.

ఇటీవలే వెస్టిండీస్‌పై కమ్మిన్స్ సేన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో విజయం సాధించిన తర్వాత అగ్రస్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక రెండో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ మూడో స్థానంలో.. ఇండియా (33.33) నాలుగో స్థానంలో ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సైకిల్‌లో న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా ఇంకా ఎలాంటి మ్యాచ్‌లు ఆడలేదు. ఇటీవల జింబాబ్వేతో ముగిసిన టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో డిఫెండింగ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికా జింబాబ్వేను 2-0 తేడాతో ఓడించినా జింబాబ్వే ప్రస్తుత WTC సైకిల్‌లో భాగం కానందున ఆ సిరీస్‌ను పరిగణలోకి తీసుకోలేదు.