
టీ20 క్రికెట్ లో ఇంగ్లాండ్ ఎంత ప్రమాదకారో మరోసారి నిరూపించింది. పటిష్టమైన న్యూజిలాండ్ జట్టును సొంతగడ్డపై ఓడించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సోమవారం (అక్టోబర్ 20) క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ పై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రూక్ (35 బంతుల్లో 78: 6 ఫోర్లు, 5 సిక్సర్లు), సాల్ట్ (56 బంతుల్లో 85: 11 ఫోర్లు, సిక్సర్) హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 18 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 గురువారం (అక్టోబర్ 23) జరుగుతుంది. 35 బంతుల్లోనే 78 పరుగులు చేసిన బ్రూక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే బట్లర్ (4) వికెట్ కోల్పోయింది. ఈ దశలో బెతేల్ తో కలిసి సాల్ట్ శర వేగంతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రెండో వికెట్ కు 44 పరుగులు జోడించిన తర్వాత బెతేల్ ఔటయ్యాడు.
బెతేల్ ఔటయ్యాక బ్రూక్ తో కలిసి సాల్ట్ పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా బ్రూక్ 200 పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. ఇద్దరూ కివీస్ బౌలర్లను ఒక ఆడనుకుంటూ మూడో వికెట్ కు ఏకంగా 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడడం విశేషం. చివర్లో బంటన్ 12 బంతుల్లోనే 29 పరుగులు చేయడంతో ఇంగ్లాండ్ స్కోర్ 230 పరుగులు దాటింది. లక్ష్య ఛేదనలో న్యూనిలాండ్ 18 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (36), సీఫెర్ట్ (39), చాప్ మాన్ (28) కొన్ని మెరుపులు మెరిపించగా మిగిలినవారు ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీసుకొని గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
England outclass New Zealand in Christchurch to go 1-0 up!
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2025
Scorecard: https://t.co/iBpG7WV6T3 pic.twitter.com/TUrK755D8S