వానొస్తుంటే...  ఇవి తింటుంటే...

వానొస్తుంటే...  ఇవి తింటుంటే...

ఆకాశమంతా మబ్బులు కమ్మేసినప్పుడు.. చల్లగాలులు గిలిగింతలు పెడుతున్నప్పుడు.. నోటికేదైనా వేడివేడిగా తినాలనిపించడం సహజం. అది కూడా ఇంట్లో చేసినవైతే ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది. చిరు జల్లుల్ని చూస్తూ.. ఒక్కోటి తింటుంటే మజాగా ఉంటుంది. మరి ఇంకెందుకాలస్యం... వర్షాకాలానికి వెల్​కం చెప్తూ.. ఈ టేస్టీ ఫుడ్​ను ఎంజాయ్ చేయండి. 
జొన్న పాన్​కేక్
కావాల్సినవి:
తెల్ల జొన్న పిండి – అర కప్పు
దోసకాయ తురుము – అరకప్పు
ఉల్లిగడ్డ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – ఒక టీస్పూన్
నీళ్లు, నూనె, ఉప్పు – సరిపడా
పెరుగు – ఒక టేబుల్ స్పూన్
పసుపు – చిటికెడు
కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూన్​
తయారీ :
ఒక గిన్నెలో తెల్ల జొన్న పిండి, దోసకాయ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, పెరుగు, పసుపు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అందులో కొన్ని నీళ్లు పోసి కలపాలి. స్టవ్​ మీద పొంగనాల పాన్​ పెట్టి అందులో పిండి మిశ్రమాన్ని వేయాలి. ఒకవైపు ఉడికాక, వాటిని తిరగేసి రెండు వైపు కూడా మళ్లీ కాసేపు ఉడికిస్తే వేడి వేడి జొన్న పొంగనాలు రెడీ. వీటిని గ్రీన్​ చట్నీతో తింటే బాగుంటాయి. పొంగనాల పాన్​ లేకపోతే, దోశ పాన్​లో కూడా చిన్న చిన్న దోశల్లా పోసి, పాన్​కేక్​లు చేసుకోవచ్చు. 

పనీర్​ కుల్చా
కావాల్సినవి :
మైదా – ఒకటిన్నర కప్పు
ఉప్పు, నెయ్యి – సరిపడా
పెరుగు – నాలుగు టేబుల్​ స్పూన్లు
పనీర్ తురుము – ముప్పావు కప్పు
ఉల్లిగడ్డ తరుగు – అర కప్పు
పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు
అల్లం తరుగు – అర టీస్పూన్
గరం మసాలా,  పసుపు – ఒక్కోటి పావు టీస్పూన్ చొప్పున
 

తయారీ :
ఒక గిన్నెలో మైదా పిండి, ఉప్పు వేసి జల్లెడ పట్టాలి. ఆ పిండిలో పెరుగు వేసి కలపాలి. కావాలంటే కొన్ని నీళ్లు పోసుకుని, మళ్లీ కలపాలి. చివరిగా నెయ్యి వేసి కలపాలి. ఆ పిండి ముద్దపై తడి బట్ట వేసి రెండు మూడు గంటలపాటు పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో పనీర్ తురుము, ఉల్లిగడ్డ,​ అల్లం తరుగు, పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత.. రెడీ చేసిన మైదా పిండి ముద్దను చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను చిన్న చపాతీలా చేసి అందులో పనీర్​ మిశ్రమాన్ని పెట్టి చుట్టూరా మూయాలి. దాన్ని మళ్లీ ఉండలా చుట్టి చపాతీలా వత్తాలి. వీటిని పాన్​ మీద నెయ్యితో కాల్చాలి.

కార్న్ వెజిటబుల్ రోటీ
కావాల్సినవి :
మొక్కజొన్న పిండి(కార్న్​ఫ్లోర్) – ఒక కప్పు, కాలీఫ్లవర్ తురుము, మెంతాకు తరుగు – ఒక్కోటి అర కప్పు చొప్పున
ఆలుగడ్డ తురుము 
(ఉడికించి, తొక్క తీసి) – అరకప్పు
నూనె – రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి తరుగు – ఒక టీస్పూన్
గోరు వెచ్చని నీళ్లు,
ఉప్పు – సరిపడా
 

తయారీ :
మొక్కజొన్న పిండిని జల్లెడ పట్టాలి. ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో కాలీఫ్లవర్ తురుము, మెంతాకు, పచ్చిమిర్చి తరుగు, ఆలుగడ్డ తురుము, ఉప్పు వేసి, గోరు వెచ్చని నీళ్లు పోసి ముద్దలా కలపాలి. ఈ ముద్దలో కొంచెం పిండి తీసుకుని రోటీలా వత్తాలి. ఆ రోటీని పాన్​ మీద వేసి నూనెతో కాల్చాలి. రెండు వైపులా కాలాక ప్లేట్​లోకి తీసుకోవాలి. ఈ రోటీలను ఏదైనా పచ్చడి లేదా పెరుగుతో తింటే టేస్ట్ బాగుంటుంది.
కాకరకాయ టిక్కీ
 

కావాల్సినవి :
కాకరకాయ తురుము – అర కప్పు
నూనె, ఉప్పు – సరిపడా, క్యారెట్ తురుము – ముప్పావు కప్పు, పనీర్​ తురుము – పావు కప్పు, కొత్తిమీర – కొద్దిగా, పచ్చిమిర్చి పేస్ట్ – రెండు టేబుల్ స్పూన్లు, బ్రెడ్ క్రంబ్స్ – పావు కప్పు
ఆమ్​చూర్ పొడి – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు – ఒకటిన్నర టేబుల్ స్పూన్, టొమాటో తరుగు – ఒక కప్పు, ఉల్లికాడల తరుగు – పావు కప్పు, ఎండుమిర్చి తునకలు – అర టీస్పూన్
తయారీ :
ఒక గిన్నెలో కాకరకాయ తురుము, ఉప్పు వేసి కలపాలి. కాసేపటి తర్వాత అందులో వచ్చిన నీళ్లను పిండేయాలి. ఆ తర్వాత కాకర తురుములో క్యారెట్, ఉల్లికాడలు, కొత్తిమీర తరుగు, పనీర్ తురుము, ఆమ్​చూర్ పొడి, బ్రెడ్ క్రంబ్స్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి, వాటిని టిక్కీలా వత్తాలి. ఒక పాన్​లో నూనె రాసి, టిక్కీలు పెట్టి, వాటి చుట్టూ నూనె రాసి కాసేపు కాల్చాలి. ఒకవైపు కాలాక, రెండో వైపు కూడా కాల్చాలి.  మరోపాన్​లో నూనె వేడి చేసి ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. తర్వాత టొమాటో, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి తునకలు, ఉప్పు వేసి వేగించాలి. అందులో కొన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి. చివరిగా కొత్తిమీర, ఉల్లికాడల తరుగు వేసి కలపాలి. అంతే, వేడివేడిగా కాకర టిక్కీ, టొమాటో చట్నీ రెడీ. ఈ రెండింటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది డయాబెటిక్ వాళ్లకు మంచిది.
మసాలా పనీర్ నాన్​
 

కావాల్సినవి :
మైదా – రెండుంపావు కప్పులు
పెరుగు – ముప్పావు కప్పు
బేకింగ్ పౌడర్, చక్కెర – ఒక్కో టీస్పూన్ చొప్పున
బేకింగ్ సోడా – అర టీస్పూన్
ఉప్పు, నూనె – సరిపడా
పనీర్ తురుము – ఒకటింపావు కప్పు
ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు
అల్లం పేస్ట్ – అర టీస్పూన్
పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు
కొత్తిమీర తరుగు, పసుపు – ఒక్కోటి పావు టీస్పూన్​ చొప్పున
కారం, చాట్ మసాలా – ఒక్కోటి టీస్పూన్ చొప్పున
తయారీ :
ఒక గిన్నెలో మైదా పిండి వేసి అందులో పెరుగు, బేకింగ్ పౌడర్, చక్కెర, ఉప్పు, బేకింగ్ సోడా వేయాలి. అందులో కొన్ని నీళ్లు పోసి కలిపి ముద్ద చేయాలి. దానిపై నూనె రాసి, తడి బట్ట వేసి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పనీర్ తురుము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్ట్, కొత్తిమీర తరుగు, పసుపు, కారం, చాట్ మసాలా వేసి కలిపి ముద్ద చేయాలి. 
మైదా పిండి ముద్దను తీసుకుని చేతిలోనే చిన్న చపాతీలా వత్తాలి. అందులో పనీర్ మిశ్రమాన్ని పెట్టి ఉండ చేయాలి. దాన్ని చపాతీ కర్రతో మామూలు రోటీలా చేయాలి. కావాలంటే చపాతీల్లా వత్తేటప్పుడు నల్ల నువ్వులు చల్లాలి. తర్వాత నూనె లేకుండా పాన్​ మీద రెండు వైపులా కాల్చాలి.