కోర్టు నంబర్​ 1లో మొదలై.. అక్కడే ముగిసింది : సీజేఐ జస్టిస్ యూయూ లలిత్

కోర్టు నంబర్​ 1లో మొదలై.. అక్కడే ముగిసింది : సీజేఐ జస్టిస్ యూయూ లలిత్
  • 50 వ సీజేఐగా రేపు ప్రమాణం చేయనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తన ప్రయాణం 37 ఏండ్ల పాటు కొనసాగిందని, ఈ కాలంలో లాయర్​గా, జడ్జిగా కూడా ఎంతో ఎంజాయ్​ చేశానని సీజేఐ జస్టిస్ ఉదయ్‌ ఉమేశ్‌  లలిత్ అన్నారు.  మంగళవారం రిటైర్​ కానున్న సీజేఐ లలిత్.. సోమవారం వీడ్కోలు బెంచ్​కు నేతృత్వం వహించారు. ఈ బెంచ్​లో లలిత్​ వారసుడు.. తదుపరి సీజేఐ జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్ బెలా ఎం త్రివేది ఉన్నారు. జస్టిస్‌ లలిత్‌కు తోటి జడ్జిలు, అడ్వొకేట్లు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఎంతో సంతృప్తిని ఇచ్చింది: జస్టిస్​ లలిత్

‘‘ఈ కోర్టులో నేను దాదాపు 37 ఏండ్లు గడిపాను. కోర్ట్​ నంబర్​ 1తో ఈ కోర్టుతో నా అనుబంధం మొదలైంది. నేను మొదట బాంబేలో ప్రాక్టీస్​ మొదలుపెట్టా. ఆ తర్వాత రిటైర్డ్​​​ సీజేఐ వైవీ చంద్రచూడ్​ ఎదుట ఓ కేసులో హాజరయ్యేందుకు సుప్రీంకోర్టుకు వచ్చా. ఏ కోర్టులో అయితే నా జర్నీ మొదలైందో అక్కడే ఈ రోజు ముగిసింది” అని జస్టిస్​ లలిత్​ చెప్పారు. ఒకేరోజు రెండు రాజ్యాంగ ధర్మసనాలు పనిచేయడం తాను చూడలేదని, ఈ రోజు అది జరగడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. తదుపరి సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లలిత్ గురించి మాట్లాడుతూ.. ఈ కోర్టులోనే సీనియర్ అడ్వొకేట్‌గా మారి ఆ తర్వాత జడ్జిగా ఎదిగిన లలిత్​ ప్రత్యేకమైన వ్యక్తి అని కొనియాడారు. జస్టిస్​ లలిత్​ పదవీకాలంలో పెద్ద సంఖ్యలో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. ఆయన అమలుచేసిన సంస్కరణలను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. అటార్నీ జనరల్​ ఆర్​ వెంకటరమణి మాట్లాడుతూ.. సీజేఐ పోస్టులో జస్టిస్ లలిత్​ లేకపోవడం లోటేనన్నారు. సొలిసిటర్ జనరల్​ తుషార్​ మెహతా, సీనియర్​ అడ్వొకేట్​ కేకే వేణుగోపాల్, సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్ వికాస్​ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సెలవు కావడంతో ఒకరోజు ముందే..

జస్టిస్​ లలిత్​ 1957 నవంబర్​ 9న పుట్టారు. 1983 జూన్​లో అడ్వొకేట్​గా ఎన్​రోల్​ అయ్యారు. 1985 డిసెంబర్​ వరకు బాంబే హైకోర్టులో ప్రాక్టీస్​ చేశారు. 1986 జనవరిలో తన ప్రాక్టీస్​ను ఢిల్లీకి షిఫ్ట్​ చేశారు. 2004 ఏప్రిల్​లో ఆయనకు సుప్రీంకోర్టులో సీనియర్​ అడ్వొకేట్​ హోదా దక్కింది. 2014 ఆగస్టు 3న నేరుగా బార్​ నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్​ అయ్యారు. జస్టిస్‌ లలిత్‌ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉన్నా.. గురునానక్‌ జయంతి సందర్భంగా కోర్టుకు సెలవు కావడంతో సోమవారమే వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. 49వ సీజేఐగా ఆగస్టు 27న ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ లలిత్‌.. 74 రోజులపాటు పదవిలో ఉన్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ నెల 9న బాధ్యతలు స్వీకరించనున్నారు. 2024 నవంబర్‌ 10 వరకు జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవిలో కొనసాగుతారు.