పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు

పాత విధానంలోనే ప్రవేశ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరానికి వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలను పాత విధానంలోనే కొనసాగించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే ఉన్నత విద్యా మండలి త్వరలో పరీక్షల షెడ్యూల్​ప్రకటించనుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ విద్యాసంస్థల్లో జరిగే అడ్మిషన్లలో పదేండ్ల దాకా ఏపీ స్టూడెంట్లకు ఓపెన్ కోటాలో సీట్లు పొందే అవకాశం ఉంది. అయితే, జూన్ 2తో పదేండ్ల గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో జూన్ 2 తర్వాత తెలంగాణలో ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్లు ఇస్తే, ఏపీ స్టూడెంట్లకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన రివ్యూ సమావేశంలో విద్యాశాఖ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. 

ఎంసెట్, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలపై దీని ప్రభావం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న సీట్లలో 85 శాతం లోకల్ కోటాలో భర్తీ చేస్తుండగా, 15% ఓపెన్ కోటా కింద సీట్లను నింపుతున్నారు. అయితే ఓపెన్ కోటాలో  ఏపీ స్టూడెంట్లు మెరిట్​లో పోటీపడే అవకాశం ఉంది. ఇలా ఏటా సుమారు 5% సీట్లు ఏపీ విద్యార్థులు పొందుతున్నారని అంచనా. ఈ నేపథ్యంలో జూన్ 2 తర్వాత సెట్స్ నోటిఫికేషన్లు ఇస్తే, మొత్తం తెలంగాణ స్టూడెంట్లతోనే భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది.ఈ ప్రక్రియ నిర్వహించాలంటే ప్రవేశ పరీక్షలను జులై, ఆగస్టు నెలల్లో నిర్వహించాల్సి వస్తుంది. దాని వల్ల అకడమిక్ ఇయర్ అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈ ఏడాది పాత విధానంలోనే కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. 

మే, జూన్ లో ప్రవేశ పరీక్షలు 

రాష్ట్రంలో జరిగే అన్ని ప్రవేశపరీక్షల షెడ్యూల్​దాదాపు సిద్ధమైంది. టీఎస్​ఎంసెట్, ఈసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్​ సెట్, పీజీఈసెట్, పీఈసెట్ తదితర ఎంట్రెన్స్ లన్నీ మే, జూన్ నెలల్లో నిర్వహించేందుకు హయ్యర్ ఎడ్యుకేషన్  కౌన్సిల్ అధికారులు షెడ్యూల్ రూపొందించారు. దీన్ని సర్కారు ఆమోదానికి పంపించారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంతో  సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన నుంచి రాగానే, అధికారంగా అన్ని ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు.