పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

ప్రతి జీవికీ జీవనాధారం ప్రకృతి. ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. పర్యావరణంపై అవగాహన, సమస్యల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి  ప్రతి ఏడాది జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని జరపాలని 1974లో తీర్మానం చేసింది. గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత, గాలి కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం వంటివి  ప్రధాన పర్యావరణానికి సమస్యలపై కార్యాచరణ కోసం ఏటా  143 దేశాలు పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చర్యలు తీసుకుంది. పర్యావరణంపై అవగాహన పెంచడానికి ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్‌‌తో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు బద్దలవడం , ఇండస్ట్రియల్ పొల్యూషన్‌‌ వల్ల మానవాళిపై పెను ప్రభావం పడుతోంది. ఏటా కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 100 సిటీల జాబితాలో 15 ఇండియావే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పేర్కొంది.

కరోనాతో ప్రభావితమైన దేశాల్లో ఎయిర్, వాటర్‌‌‌‌, సౌండ్ పొల్యూషన్‌‌ కొంతమేర తగ్గిందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సానుకూల మార్పుకు రైతులు, విద్యార్థులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు.. హరిత భవిష్యత్‌‌ పరిరక్షణకు  కృషి చేయాల్సిన అవసరం ఉంది. సకల జీవరాశులు, మానవ మనుగడ సాగించడానికి పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యం. ప్రజల్లో అవగాహన పెంచి.. ప్రతి గ్రామంలో చెట్లు నాటాలి. పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి. రోడ్ల వెంబడి, పొలం గట్ల మీద, ఖాళీ ప్రదేశాలలో విరివిగా మొక్కలు నాటాలి. వాహనాల వాడకాన్ని తగ్గించాలి. పర్యావరణ పరిరక్షణ దినోత్సవం గురించి గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేయాలి. 

                                                                                     - కామిడి సతీష్ రెడ్డి, భూపాలపల్లి