పాలమూరు, సీతమ్మసాగర్కు లైన్ క్లియర్!

పాలమూరు, సీతమ్మసాగర్కు లైన్ క్లియర్!
  •     పర్యావరణ అనుమతులు పొందేందుకు అవకాశం
  •     నిర్మాణం తర్వాత ఈ పర్మిషన్లు ఇవ్వొద్దని గతంలో సుప్రీం తీర్పు
  •     ఇప్పుడు ఆ తీర్పును కొట్టేసిన త్రీ జడ్జెస్ బెంచ్​
  •     పర్యావరణ నష్టానికి ఫైన్ చెల్లించి అనుమతులు తీసుకోవచ్చని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, సీతమ్మసాగర్ లిఫ్ట్ స్కీమ్​కు అడ్డంకులు తొలగిపోతున్నాయి. ఈ ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు, నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. వాస్తవానికి, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులను కట్టరాదంటూ నిరుడు మేలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఏ రాష్ట్రమైనా ప్రాజెక్టులు కట్టాక అనుమతుల కోసం వస్తే.. పర్మిషన్​ ఇవ్వొద్దని కేంద్రానికి నాడు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. 

అయితే, తాజాగా ఆ తీర్పును ముగ్గురు జడ్జిల బెంచ్ కొట్టివేసింది. ఒకవేళ అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మిస్తే.. ఫైన్ చెల్లించి అనుమతులు తీసుకోవచ్చని ఈ నెల18న తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే ఆ రెండు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయినట్టయింది. దీంతో తీర్పు వచ్చిన వెంటనే ఇటీవల పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని మంత్రులు, అధికారులు.. కేంద్ర పర్యావరణ మంత్రిని కలిసి అనుమతులివ్వాలని, కోరగా, కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

పాలమూరు పరిస్థితి ఇదీ..

ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్​ను చేపట్టింది. మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వినియోగించుకోని 45 టీఎంసీలు, గోదావరి డైవర్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా వచ్చే 45 టీఎంసీలు సహా 90 టీఎంసీలను తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు. అయితే, ఎన్నెన్నో కొర్రీలు పెట్టిన అనంతరం 49వ ఈఏసీ (ఎక్స్​పర్ట్స్ అప్రైజల్ కమిటీ) మీటింగ్​లో పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. 

కానీ, రెండేండ్లవుతున్నా అనుమతులను మాత్రం ఇవ్వడం లేదు. ఇటు పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించిన వెంటనే కొందరు కావాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్​లో కేసు వేశారు. దీంతో ఎన్జీటీ రూ.248 కోట్ల ఫైన్ విధించింది. దీనిని సుప్రీంకోర్టులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సవాల్ చేసింది. దీంతో ఎన్జీటీ తీర్పుపై సుప్రీం స్టే విధించింది. తాగునీటి కోసం చేపట్టే మొదటి దశ పనులకు అనుమతిచ్చింది. 

పర్యావరణ నష్టాన్ని అంచనా వేయాలని, అందుకు కమిటీని నియమించాలని, ఆ కమిటీ నివేదిక మేరకు పర్యావరణ నష్టపరిహారం నిధులను చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ ఓ సబ్ కమిటీని వేయగా.. ఆ కమిటీ ప్రాజెక్ట్ స్థితిగతులను పరిశీలించి, నివేదికను ఎన్జీటీకి సమర్పించింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్జీటీలో ఫైన్​ చెల్లించి.. పర్యావరణ క్లియరెన్సులు తెచ్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. త్వరలోనే అధికారులు కేంద్ర ప్రభుత్వానికి దీనిపై లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు.    

సీతమ్మసాగర్​కు ఫైన్ చెల్లించి.. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 9 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీళ్లందించేందుకు సీతమ్మసాగర్ లిఫ్ట్ స్కీమ్ చేపట్టగా.. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును నిర్మిస్తున్నారంటూ 2023లో కొందరు వ్యక్తులు ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్జీటీ రూ.54 కోట్ల ఫైన్ విధించింది. 

ఆ ఫైన్​పై ఎన్జీటీలో కేసు విచారణ పెండింగ్ లో ఉండటంతో ఆ ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో.. ఎన్జీటీలో ఆ ఫైన్ మొత్తాన్ని చెల్లించి పర్యావరణ అనుమతులు పొందేందుకు అవకాశం ఏర్పడింది. దీనిపై ఇప్పటికే మంత్రులు, అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశారు.