గుట్ట నర్సన్న ఆదాయం రూ.224 కోట్లు

గుట్ట నర్సన్న ఆదాయం రూ.224 కోట్లు
  •     ఏడాది ఖర్చు రూ.214 కోట్లు  
  •     నిరుడు వచ్చింది రూ.193 కోట్లే 
  •     బ్రేక్​దర్శనాలు, ప్రసాద విక్రయం

 యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షికాదాయం రూ.224.25 కోట్లు వచ్చిందని ఈవో భాస్కర్ రావు తెలిపారు. సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు. 2023-–24లో ఆలయానికి స్థూల ఆదాయం రూ.224,25,87,229 రాగా.. రూ.214,55,85,249 ఖర్చయ్యింది. నికర ఆదాయం రూ.151,00,40,535 రాగా.. రూ.119,53,76,018 ఖర్చయ్యింది 2022-23లో రూ.193 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.  టెంపుల్ రీ ఓపెన్ తర్వాత భక్తుల రాక పెరగడం, అదేవిధంగా బ్రేక్ దర్శన(ఒక్క టికెట్ రూ.300) సదుపాయాన్ని కొత్తగా అందుబాటులోకి తేవడంతో సంవత్సరాదాయం భారీగా పెరిగింది.

2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో బ్రేక్ దర్శనాలను కొత్తగా ప్రవేశపెట్టడంతో కేవలం రూ.2.70 కోట్లు మాత్రమే సమకూరింది. కానీ,2023–-24లో బ్రేక్ దర్శనాల ద్వారా ఏకంగా రూ.7,62,27,900 వచ్చింది. అదే విధంగా గతం కంటే ప్రసాదాల విక్రయం ద్వారా, హుండీల ద్వారా దాదాపుగా రూ.కోటి చొప్పున ఆదాయం అధికంగా వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.  వసతి గృహాల ద్వారా రూ.2,74,52,489, హుండీలతో రూ.32,26,06,456, సత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.5,61,84,600, పాతగుట్ట స్పెషల్ దర్శనాల ద్వారా(టికెట్ రూ.50) రూ.15,21,650, యాదగిరిగుట్ట వీఐపీ దర్శనాలతో( టికెట్ రూ.150) రూ.10,28,91,900, బ్రేక్ దర్శనాలతో రూ.7,62,27,900, ఆర్జిత సేవలతో రూ.10,46,82,186, వచ్చాయి.