కేంద్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయం కోసం తాజా ముసాయిదా పురుగుమందుల నిర్వహణ బిల్లు 2025ను విడుదల చేసింది. 2008, 2017, 2019, 2020లలో ముసాయిదాల తర్వాత ఇది ఐదవ విడత. దాదాపు 18 ఏండ్ల నుంచి ఈ వ్యవహారం ముసాయిదా దశలోనే ఉన్నది. కారణం, పెస్టిసైడ్ కంపెనీ ప్రయోజనాలతో రైతులు, వినియోగదారులు, పర్యావరణ ప్రయోజనాలతో ముడిపడిన సంఘర్షణ. సరికొత్త ముసాయిదా ‘పురుగుమందుల నిర్వహణ బిల్లు 2020’ అనే శీర్షికను కలిగి ఉంది, ఎందుకంటే 2020 బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టడంతో సాంకేతికంగా అప్పటి ముసాయిదా సజీవంగా ఉంది. కొత్తగా పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. 2020 ముసాయిదాకు సవరణలు ప్రతిపాదిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆమేరకు స్పష్టం చేయడం లేదు. కీటకనాశక రసాయన పరిశ్రమ నిరంతరం ప్రభుత్వ నియంత్రణను సవాలు చేస్తున్నది. ప్రభుత్వ నియంత్రణలో ఉండకుండా ఈ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వ నిర్ణేతల మీద అనేక రూపాలలో ఒత్తిడి చేస్తున్నది. వారి వాదనలు అన్నీ కూడా రైతు భుజంమీదుగా ఎక్కుపెట్టినవే. రైతులకు ఉపయోగిస్తున్నారు కాబట్టి మా ఉత్పత్తులు నియంత్రించవద్దు అంటారు. నాసి రకం, కల్తీ, నాణ్యత లేని వ్యవసాయ రసాయనాలు దాదాపు 40 శాతం ఉన్నాయని వారి అధ్యయనాలలో బయల్పడినా కూడా ఈ పరిశ్రమ నష్టపోతున్న రైతుల గురించి మాట కూడా మాట్లాడరు. ధరలు కంపెనీల ఇష్టానుసారమే.
నియంత్రణ లేని కీటకనాశక రసాయనాల పరిశ్రమ ప్రభుత్వ నియంత్రణ ఉండాలని రైతులు ఒకవైపు కోరుతుంటే ధర నియంత్రణ వద్దు, వ్యవసాయ ముడి సరుకు కాబట్టి పన్నుల (జీఎస్టీ, ఆదాయం) నుంచి మినహాయింపు కోరుతున్నది ఈ పరిశ్రమ. వ్యవసాయ ఉత్పాదకతలో విష రసాయనాల పాత్ర నామమాత్రం అని శాస్త్రీయంగా రుజువు అయ్యింది. ప్రస్తుత ప్రాపంచిక పరిస్థితులలో సుస్థిర వ్యవసాయం దిశగా ప్రపంచ వ్యాప్తంగా అడుగులు పడుతున్న సందర్భంలో వీటి అవసరం లేదు అని కూడా భావిస్తున్నారు. ఈ విష రసాయనాలు రైతులు, వారి కుటుంబాల ఆర్థిక, శారీరక ఆరోగ్యంపై భారంగా మారాయి. 1968 క్రిమిసంహారక చట్టం వచ్చిన 57 సంవత్సరాలలో, ముఖ్యంగా 2008 ముసాయిదా బిల్లు నుంచి 18 సంవత్సరాలలో ఈ విష రసాయనాల వల్ల అనారోగ్య సమస్యలు, మరణాలు పెరిగాయి. గాలి, నీరు, నేలను నిరంతరం కలుషితం చేస్తున్నాయి. ఇదివరకటి ముసాయిదాలలో లాగానే 2025లో కూడా మూడు ప్రాథమిక అంశాలు లేవు. విష రసాయనాల దుష్ప్రభావానికి తయారీదారుల బాధ్యత, ధరల నియంత్రణ, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన అధికారాలు. ఈ మూడు ప్రజలనుంచి ఏనాటినుంచో ఉన్న డిమాండ్లు. ఇవి లేకుండా సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు లాబీయిస్టులు.
అంతర్జాతీయ ఒప్పంద బాధ్యతలు
భారతదేశం విష రసాయనాలకు సంబంధించిన వివిధ అంతర్జాతీయ సమావేశాలలో ఒక పార్టీగా ఉంది. వీటిలో బాసెల్ కన్వెన్షన్, స్టాక్‌హోమ్ కన్వెన్షన్, రొట్టేర్డం కన్వెన్షన్ కీలకమైనవి. ప్రతి రెండేండ్లకు ఒకసారి జరిగే ఈ సమావేశాలలో అనేక నిర్ణయాలు వెలువడుతుంటాయి. వాటిని అమలు చేస్తామనే
నిబద్ధత ఈ బిల్లులో స్పష్టంగా చేర్చాలి. భారతదేశం పార్టీగా ఉన్న అన్ని అంతర్జాతీయ సమావేశాల నిర్ణయాలను అమలు చేయడానికి ప్రతిపాదిత కేంద్ర పురుగుమందుల బోర్డు బాధ్యత వహించాలి. దేశీయ చట్టం అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. పురుగుమందుల తయారీదారుల నుంచి, పంపిణీదారుల నుంచి చిల్లర వ్యాపారుల వరకు ప్రతిదశలో లైసెన్సింగ్ తప్పనిసరి చేయాలి. ముఖ్యంగా, వ్యవసాయ విస్తరణ అధికారుల ప్రిస్క్రిప్షన్లు కూడా నియంత్రణ పరిధిలోకి రావాలి. అధికారులు, సంస్థలు జారీ చేసిన అన్నిరకాల విష రసాయనాలతో కూడిన పంట రక్షణ సలహాలను నమోదు చేయాలి, దుర్వినియోగం కాకుండా తగినంతగా పర్యవేక్షించాలి. స్థానిక అధికారులను - పంచాయతీలు, మునిసిపల్ సంస్థలు, అగ్నిమాపక సేవలు, అత్యవసర వైద్య సేవలు - అత్యవసర ప్రతిస్పందన ప్రణాళికలలో చేర్చాలి.
పర్యావరణం మీద దుష్ప్రభావాలు
ఈ విష రసాయనాలను తట్టుకునే శక్తి కలిగిన బ్యాక్టీరియా, వైరస్‌లు, కీటకాలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. అదే సమయంలో వివిధ జీవాల మధ్య ఉండే పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తూ అసమతుల్యతను పెంచుతున్నాయి. తయారీదారులు పురుగుమందులను అమ్మడం ద్వారా లాభం పొందుతారు కనుక వారి ఉత్పత్తులు కలిగించే పర్యావరణ పరిణామాలకు వారు బాధ్యత వహించాలి. విష రసాయనాల వల్ల ఉత్పన్నమవుతున్న సూపర్‌బగ్‌లు, సూపర్‌వీడ్‌లు పట్ల సమగ్ర ప్రతి స్పందన అవసరం ఉన్నది. అది ప్రజల మీద పడే భారం. వీటికి కారకులు అయిన విష రసాయనాల పరిశ్రమ జవాబుదారీగా ఉంటూ తగిన రీతిలో స్పందించాలి. చట్టం ఆ విధమైన బాధ్యత వారి మీద పెట్టాలి. వివిధ బహిరంగ ప్రదేశాలలో విచ్చలవిడిగా విష రసాయనాల ఉపయోగం వల్ల అమాయక ప్రజలు వివిధ సందర్భాలలో మరణిస్తున్నారు. ఖాళీ పురుగుమందుల డబ్బాలు, కవర్లు, ప్యాకేజీలు, కంటైనర్లను నిర్లక్ష్యంగా పడేయడం పిల్లలకు, అవగాహనా లేని వ్యక్తులకు, వన్యప్రాణులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రమాదాలను తగ్గించడానికి ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు
విష రసాయనాల వల్ల స్థానిక వాతావరణ పరిస్థితులు, పర్యావరణం, మానవ ఆరోగ్యం మీద పడుతున్న దుష్ప్రభావం నేపథ్యంలో వాటిని నియంత్రించడానికి, పరిమితం చేయడానికి లేదా నిషేధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన అధికారాలు ఇవ్వాలి. భారతదేశం అంతటా వ్యవసాయ వ్యవస్థల వైవిధ్యం, పర్యావరణ పరిస్థితులు, సామాజిక సందర్భాలను కేంద్రీకృత నియంత్రణ చట్టం తగినంతగా పరిష్కరించదు. పురుగు మందుల వల్ల సమస్యలు తలెత్తినప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించే అధికారం రాష్ట్రాలకు ఉండాలి. ధరల నియంత్రణ యంత్రాంగం లేకపోవడం వల్ల పురుగుమందుల కంపెనీలు రైతుల నుంచి గరిష్ట లాభాలను పొందుతున్నాయి. ఒకవైపు లాభాలు పొందుతూ ఎటువంటి జవాబుదారీతనం లేకుండా తమ పని కొనసాగింపుకు రాజకీయవేత్తలను ఒత్తిడికి గురి చేస్తున్నాయి ఈ కంపెనీలు.
ధరల నియంత్రణ రైతు ఆర్థికవ్యవస్థను కాపాడుతూనే అధిక విష రసాయన వినియోగాన్ని తగ్గించగలవు. 2025 నాటి పురుగుమందుల నిర్వహణ బిల్లు, 18 సంవత్సరాలలో ఐదవ ముసాయిదా అయినప్పటికీ, 1968 నాటి పురుగుమందుల చట్టం వచ్చిన 57 సంవత్సరాలలో స్పష్టంగా కనిపించిన ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. తయారీదారులకు నేర బాధ్యత, వ్యవసాయ సలహాదారులతో సహా సమగ్ర సరఫరా గొలుసు లైసెన్సింగ్, అత్యవసర నిర్వహణ నిబంధనలు, నిరోధక బాధ్యత, తగినంత రాష్ట్ర అధికారాలు, నియంత్రణ లేకుండా ఈ బిల్లు ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే పురుగుమందులను నియంత్రించడానికి బదులుగా వాటి కొనసాగింపును శాశ్వతం చేస్తుంది. అర్థవంతమైన నియంత్రణకు, పరిశ్రమ ప్రయోజనాలను నిలువరించడానికి, కార్పొరేట్ లాభాల కంటే మానవ, పర్యావరణ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడానికి రాజకీయవేత్తలకు ధైర్యం అవసరం. ప్రస్తుతం రూపొందించిన ఈ బిల్లులో ఆ ధైర్యం లేదు.
అంచనా వేయని ప్రభావాలు
ఈ ముసాయిదాలో పురుగుమందుల ప్రభావాలను ఒక క్రమపద్ధతిలో అంచనా వేయలేదు. గ్రామీణ ప్రాంతాలలో విష రసాయనాల వల్ల అనేకమంది అనారోగ్యానికి గురి అవుతున్నారు. చనిపోతున్నారు. అనేక గ్రామాలలో మూత్రపిండాలు విఫలమై డయాలిసిస్ కోసం వేలల్లో ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. సగటున క్యాన్సర్ బాధితుల సంఖ్య కూడా పెరుగుతున్నది. రసాయన అవశేషాలు లేని ఆహారం దొరకక ప్రజలు అలమటిస్తున్నారు. పురుగు మందుల ఖర్చులు రైతులను భరించలేని అప్పుల్లోకి నెట్టివేస్తున్నాయని ఆధారాలు ఉన్నప్పటికీ, వ్యవసాయ అధికారులు కనీసంగా గుర్తించడంలేదు. రైతును అప్పుల ఊబిలోకి నెట్టడంలో పురుగు మందుల పాత్రను ఎవరూ పట్టించుకోరు. ఈ విష రసాయనాలు తయారు చేసేటప్పుడు, రవాణాలో, నత్రజని ఆధారిత సమ్మేళనాల నుంచి నైట్రస్ ఆక్సైడ్ విడుదల ద్వారా వాతావరణ మార్పులకు దోహదపడుతున్న పురుగుమందుల పాత్రను విస్మరిస్తున్నారు. విపరీత పురుగుమందుల వాడకం వల్ల నేల క్షీణత, జీవ వైవిధ్య నాశనం ద్వారా పంట దిగుబడి తగ్గడం వంటి పరిణామాలను ఆధారాలు ఉన్నప్పటికీ పరిశీలించడంలేదు.
- డా. దొంతి నరసింహారెడ్డి,
పాలసీ ఎనలిస్ట్
