రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రకృతి ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అనంత నగర్, అమృత హాస్పిటల్ పరిసర ప్రాంతంలో ఒక్కసారిగా భారీ గాలిదుమారం వీచింది. ఈ ఈదురు గాలుల ధాటికి అక్కడ ఉన్న ఒక భారీ వృక్షం ఒక్కసారిగా వేర్లతో సహా పెకిలించుకుని పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై కూలిపోయింది. ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. బరువైన ఆ చెట్టు పడటంతో విద్యుత్ స్తంభం కాస్తా విరిగిపోయింది. అంతేకాదు, ఆ స్తంభంపై ఉన్న భారీ ట్రాన్స్‌ఫార్మర్ కూడా రోడ్డుపై నేలకూలింది.
అయితే ఇదే సమయంలో అక్కడ ఊహించని ఉత్కంఠ నెలకొంది. చెట్టు కూలిన సమయంలో ఆ ప్రాంతంలోనే ఆగి ఉన్న ఒక కారుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కరెంట్ వైర్లు ఒక్కసారిగా కారుపై పడటంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు భయాందోళనలతో ఉలిక్కిపడ్డారు. విద్యుత్ లైన్లు తెగిపడటం వల్ల భారీ ప్రమాదం జరగాల్సి ఉంది.. కానీ, అదృష్టవశాత్తు కారులో ఉన్న వ్యక్తికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు బాడీ ఇన్సులేటర్‌లా పనిచేయడం వల్ల లోపల ఉన్న వ్యక్తి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడని, ఇదంతా ఆ దేవుడి దయేనని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘోర ప్రమాదంతో అనంత నగర్ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు కూడా స్వల్ప అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న వెంటనే సిరిసిల్ల పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెట్టును తొలగించి, రవాణాను పునరుద్ధరించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ట్రాన్స్‌ఫార్మర్ కూలిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని, మరమ్మతులు పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
ఏదేమైనా త్రుటిలో భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, వర్షాకాలం ముందుకొస్తున్న నేపథ్యంలో.. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రోడ్ల పక్కన ప్రమాదకరంగా ఉన్న పాత చెట్లను అధికారులు ముందుగానే గుర్తించి, తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
