బీఆర్ఎస్ నాయకులు ఎంత ప్రయత్నించినా.. సీఎం రేవంత్ రెడ్డి రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాలేదు. అయినా కొందరు బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం తెలంగాణలో హింసను ప్రేరేపిస్తున్నారు.
కోల్పోయిన అధికారం తిరిగి పొందటానికి కృత్రిమ పోరాటాలను నమ్ముకుంటున్నారు. వారికి నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిండం చేతకావడంలేదు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో హింసను ప్రేరేపించేందుకు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మొన్న చేసిన విధ్వంసకర మిలిటెంట్ పోరాట వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
బాల్క సుమన్ చేసిన విధ్వంసకర వ్యాఖ్యల నేపథ్యంలో, గతంలో బీఆర్ఎస్ నాయకులు పాల్పడిన ప్రేరేపిత హింసాత్మక ఘటనలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. 2024 నవంబర్ 11న కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా క్లస్టర్ స్థాపన కోసం భూసేకరణ, ప్రజాభిప్రాయం కోసం వెళ్ళిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగానాయక్, కొడంగల్ ఏరియా అభివృద్ధి అధికారి వెంకట్ రెడ్డి, రెవెన్యూ అధికారులపై రైతుల ముసుగులో పథకం ప్రకారం బీఆర్ఎస్ గూండాలు చేసిన దాడి బీఆర్ఎస్ నాయకుల ప్రేరేపితమని తేలింది. ఇందులో నిజమైన రైతులెవరూ పాల్గొనలేదు.
క్యాతనపల్లిలో..
ఇటీవల 17 ఫిబ్రవరి 2026 నాడు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల పరిశీలనకు, ఎన్నికల్లో పాల్గొనడానికి వెళ్ళిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీ కృష్ణల కాన్వాయ్‌పై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో మంత్రి వివేక్ వెంకటస్వామి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు బాల్క సుమన్‌ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయినా ఆయన వైఖరిలో మార్పు రాలేదు.
బీఆర్ఎస్ కృత్రిమ ఉద్యమాలు
కృత్రిమ నిరుద్యోగ నాయకులను తయారుచేసి వారిని నిరుద్యోగులుగా చిత్రీకరించారు. వారి ద్వారా నిజమైన నిరుద్యోగుల్లో వ్యతిరేకత తెచ్చేందుకు విఫలయత్నం చేశారు. గ్రూప్ 1 పరీక్షపై వారి ద్వారా రకరకాలుగా విషప్రచారం చేయించారు. అవన్నీ వాస్తవాలు కా దని కోర్టు తేల్చాక చల్లబడ్డారు. కానీ, విజ్ఞులైన నిరుద్యోగులు వారి ఉచ్చులో పడకుండా శ్రద్ధగా చదివారు. వారు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా భర్తీ చేసిన 67వేల 673 ఉద్యోగాలు పొంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగస్తులయ్యారు.
విద్రోహ వ్యాఖ్యలు
చివరికి వడ్లు కొనుగోలుపై రైతులను ఉపయోగించి రాజకీయం చేయాలనుకున్నారు. కానీ, రైతులు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ధర్నాల్లో పాల్గొనలేదు. బీఆర్ఎస్ ఇక్కడ విఫలమై సింగరేణిలో అగ్గి పెట్టాలనుకుంది.
సింగరేణి కార్మికులను, పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడానికి బాల్క సుమన్ టిబిజికెఎస్ సమావేశంలో సింగరేణి భవన్‌ను కాల్చేయండి, రైలు పట్టాలను కోసేయండి, జనం మనవైపు చూడాలంటే మీటింగులు పెట్టడం కాదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కాదు.. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. డబ్బులు వాటంతట అవే వస్తాయి అని మాట్లాడి యావత్ బీఆర్ఎస్ పార్టీకే నిప్పంటించాడు.
తెలంగాణ సమాజం క్షమించదు
సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వ్యవహరించేవారికి భారతీయ న్యాయ సంహిత చట్టం (బీఎన్ఎస్) ప్రకారం.. బీఎన్ఎస్ సెక్షన్ 61(నేరపూరిత కుట్ర), సెక్షన్ 196( రెచ్చగొట్టే ప్రసంగాలు ద్వారా శాంతిభద్రతలకు భంగం కలిగించటం), సెక్షన్ 326(f) 329 (పేలుడు పదార్థాల లేదా అగ్ని ద్వారా ప్రభుత్వ కార్యాలయాలను తగలబెట్టేందుకు కుట్ర చేయటం) వంటి 7 సంవత్సరాల శిక్షలు పడే చట్టాలు వీరికి సరిపోవు.
ఇలాంటి నాయకులను, రాజకీయ పార్టీలను శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎన్నికల సంఘం తన ఎన్నికల నియమావళిని సవరించాలి. క్రూరమైన, హింసాత్మక రాజకీయాలు చేసే నాయకులను ప్రోత్స హించే రాజకీయ పార్టీలను ప్రజలే స్వచ్ఛందంగా బహిష్కరించాలి.
డాక్టర్. కోటూరి మానవతారాయ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
- ఓపెన్పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
