- 1500 మొబైల్స్, మదర్‌బోర్డ్స్, బ్యాటరీస్ స్వాధీనం
ఆదిలాబాద్, వెలుగు:పాత ఫోన్లు కొనుగోలు చేసి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం వెల్లడించారు.
ఆదివారం సాయంత్రం పోలీసులు పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో అటుగా వచ్చిన నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. పట్టుబడిన నలుగురు ఢిల్లీకి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సాహిల్, అనాస్‌తో పాటు మరో మైనర్‌గా గుర్తించారు.
వీరంతా కొంతకాలంగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల నుంచి పాత ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. తర్వాత అందులో మదర్ బోర్డులు, బ్యాటరీలు వేరు చేసి ఇతర ఫోన్లలో అమర్చుతున్నారు.
అలాగే పాత ఫోన్లలో కస్టమర్ల డేటా, ఐఎంఈఐ నంబర్లు సేకరించి వాటి ద్వారా ప్రజలకు ఫోన్లు చేస్తూ బ్యాంకు అధికారులమని చెబుతూ, ఓటీపీలు తెలుసుకుంటూ అకౌంట్ల నుంచి డబ్బులు మాయం చేస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
వారిని అరెస్ట్ చేసి నాలుగు సెల్‌ఫోన్లు, 1500 పాత ఫోన్లు, మదర్ బోర్డులు, బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ పి.సునీల్‌కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, రమ్య పాల్గొన్నారు.
