
హైదరాబాద్, వెలుగు: సౌత్ సెంట్రల్ రైల్వేస్ (ఎస్సీఆర్)లో మరో గోల్‌మాల్ వెలుగు చూసింది. రైల్వే ఉద్యోగులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై రైల్వే సేఫ్టీ ట్రాక్స్ నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డారు. సేఫ్టీ ట్రాక్ మెయింటెనెన్స్ కోసం తక్కువ సంఖ్యలో మ్యాన్ పవర్ సప్లయ్ చేసి ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకున్నారు. కాజీపేట కొండపల్లి, మోటుమారి జనపహాడ్ సెక్షన్ సేఫ్టీ ట్రాక్ మెయింటెనెన్స్ కోసం రాజేంద్రనగర్ హైదర్షాకోట్‌కు చెందిన రైల్వే కాంట్రాక్టర్ జె.రత్నకుమార్‌తో 2023 జూన్12న ఎస్సీఆర్ అగ్రిమెంట్ చేసుకుంది.
ట్రాక్ నిర్వహణ కోసం పంజుగుల శకప్ప, చిరంజీ బాలరాజులను అటెండ్స్ రికార్డుల్లో కాంట్రాక్ట్ కంపెనీ పేర్కొంది. నెలకు రూ.12 వేలు జీతంగా ఆ కంపెనీ ప్రతినిధులు ప్రస్తావించారు. మూడు యూనిట్లలో ఒక్కో యూనిట్‌కు 16 మంది చొప్పున మొత్తం 48 మందిని మెంబర్లుగా రికార్డుల్లో చూపారు. సేఫ్టీ ట్రాక్ మెయింటెనెన్స్‌లో భాగంగా 80 మందిని లేబర్స్‌గా చూపుతూ ఒక్కొక్కరికి రూ.12 వేల చొప్పున నెలవారీ జీతాలు చెల్లించినట్లు రికార్డులు తయారు చేశారు.
ఈ క్రమంలోనే ఐదుగురు లేబర్లను 86 మందిగా రికార్డుల్లో చూపుతూ గతేడాది ఆగస్ట్ వరకు రూ.2.31లక్షలు జమ చేసినట్టు చూపారు. రైల్వేశాఖ నుంచి ఈపీఎఫ్ సొమ్మును సేకరించారు. ఈపీఎఫ్‌ల చెల్లింపుల జమపై అనుమానం వచ్చిన రైల్వే అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.