రేపు ఏపీ శాసనమండలిలో మారనున్న బలాబలాలు 

రేపు ఏపీ శాసనమండలిలో మారనున్న బలాబలాలు 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రేపటి నుంచి బలాబలాలు, సమీకరణాలు మొత్తం మారిపోనున్నాయి. ఇప్పటి వరకు మైనారిటీలో బలం లేకుండా ఉండిపోయిన అధికార వైసీపీకి కొత్త సభ్యుల ఎన్నికతో ఆధిక్యంలోకి రానుంది. అలాగే ఉన్న సభ్యుల పదవీకాలం ముగిసిపోవడంతో సభ్యులను కోల్పోయిన తెలుగుదేశం మండలిలో ప్రతిపక్ష స్థానానికి పరిమితం కానుంది. రేపు శాసన మండలి నుంచి ఏడుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులు రిటైర్ కానున్నారు. దీంతో మండలిలో తెలుగుదేశం పార్టీ బలం 22 నుంచి 15కు పడిపోనుంది. అలాగే అధికార వైసీపీ నుంచి ఉమారెడ్డి రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో తాజాగా నలుగురు సభ్యులు నామినేట్ చేసుకున్న అధికార వైసీపీ బలం 17 నుంచి 20కి పెరగనుంది. 
గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగా ఎన్నికైన మోషేన్ రాజు (పశ్చిమ గోదావరి), తోట త్రిమూర్తులు (తూర్పు గోదావరి), లేళ్ల అప్పిరెడ్డి (గుంటూరు), రమేష్ కుమార్ (కడప) కొత్త ఎమ్మెల్సీలుగా మండలిలో అడుగుపెట్టనున్నారు.