రైతు డిస్కంకు ఈఆర్సీ  పచ్చ జెండా... 4 నెలల్లో కార్యకలాపాలు  ప్రారంభించుకోవాలని ఆదేశాలు..

రైతు డిస్కంకు ఈఆర్సీ  పచ్చ జెండా... 4 నెలల్లో కార్యకలాపాలు  ప్రారంభించుకోవాలని ఆదేశాలు..
  • టీజీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీడీసీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లైసెన్స్ జారీ చేసిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి 
  • విద్యుత్​ కనెక్షన్లను మార్చుతూ ఉత్తర, దక్షిణ డిస్కంలకు కొత్త లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జారీ
  • వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగింపు.. మోటార్లకు మీటర్లు ఉండవు 
  • సర్కారు హామీ ఇచ్చినట్టు ఈఆర్సీ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన  ‘రైతు డిస్కమ్’​కు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదం తెలిపింది. తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్‌‌‌‌పీడీసీఎల్)కు శనివారం విద్యుత్ పంపిణీ లైసెన్స్ మంజూరు చేసింది. 4 నెలల్లో డిస్కమ్​ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 29 లక్షలకు పైగా ఉన్న ఉచిత వ్యవసాయ విద్యుత్​ లిఫ్ట్​ఇరిగేషన్‌‌తోపాటు ఇతర ఉచిత కనెక్షన్లను, విద్యుత్ లైన్లు, ట్రాన్స్​ ఫార్మర్లను రైతు డిస్కం​ పరిధిలోకి మార్చుతూ నిర్ణయం తీసుకున్నది. 

ఇదివరకు ఉత్తర, దక్షిణ డిస్కంల పరిధిలో ఉన్న ఈ కనెక్షన్లను తగ్గిస్తూ ఆ సంస్థలకు కొత్తగా లైసెన్స్​ జారీ చేసింది. రైతుల వ్యవసాయ పంపు సెట్లు, మోటార్లకు మీటర్లు ఉండవని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్​ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఈఆర్సీ స్పష్టంచేసింది.

2025 డిసెంబర్​ 17న జీవో 

రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక డిస్కమ్​ తీసుకురావాలనే ఉద్దేశంతో సర్కారు 2025 డిసెంబర్​ 17న జీవో జారీ చేసింది. 29 లక్షలకు పైగా ఉన్న ఉచిత వ్యవసాయ విద్యుత్​ కనెక్షన్లతోపాటు వ్యవసాయానికి సాగునీరందించేందుకు ఏర్పాటు చేసిన  లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్​ కనెక్షన్లు, రాష్ట్ర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే మిషన్ భగీరథ కనెక్షన్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పరిధిలోని కనెక్షన్లు, ఎల్‌‌టీ 6బీ పరిధిలోని మున్సిపల్​ వాటర్​ కనెక్షన్లు అన్నీ కూడా ఈ డిస్కం పరిధిలోకే తీసుకొచ్చారు.  

అన్ని ఉచిత విద్యుత్​ కనెక్షన్లను కొత్త డిస్కం పరిధిలోకి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిస్కంకు సీఎండీగా ముషారఫ్​ అలీ ఫారూఖీని ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. ఈ ఏడాది మార్చి 11న మూడో డిస్కంకు రైతు డిస్కం అని ప్రభుత్వం పేరు పెట్టింది.

మే 29న ఈఆర్సీ బహిరంగ విచారణ

మార్చి 19న రైతు డిస్కంకు లైసెన్స్​ జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్​ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సీఎండీ ముషారఫ్​ అలీ దరఖాస్తు చేశారు. అయితే, రైతు డిస్కంపై మొదట్లో విద్యుత్​ ఉద్యోగ సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దీంతో ఈఆర్సీ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరాలు స్వీకరించింది. మే 29న ఈఆర్సీ కార్యాలయంలో బహిరంగ విచారణ నిర్వహించింది.

81 పేజీలతో కూడిన లైసెన్స్​ జారీ

రైతు డిస్కంపై బహిరంగ విచారణ ముగిసిన నెలన్నర రోజుల తర్వాత శనివారం విద్యుత్​ పంపిణీ లైసెన్స్​ జారీ చేస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. అందరి అభిప్రాయాలను అంశాలవారీగా పరిగణనలోకి తీసుకొని కమిషన్ సమాధానాలు ఇచ్చింది. విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 14తో పాటు సెక్షన్ 131 ప్రకారం లైసెన్స్ మంజూరు చేస్తూ మొత్తం 81 పేజీలతో కూడిన నివేదిక రిలీజ్​ చేసింది. 

మొత్తం 29 లక్షలకు పైగా ఉచిత వ్యవసాయ, ఇరిగేషన్​ తదితర విద్యుత్​ కనెక్షన్లతోపాటు రూ.2,792 కోట్ల విలువ చేసే 5.22 లక్షల డిస్ట్రిబ్యూటర్​ ట్రాన్స్‌‌ఫార్మర్లు, రూ.2,137 కోట్ల విలువ చేసే 2.61 లక్షల కిలోమీటర్ల ఎల్‌‌టీ విద్యుత్​ లైన్లను రైతు డిస్కంలోకి మార్చుతూ ఈఆర్సీ నిర్ణయం తీసుకున్నది. 

ఈ ఉత్తర్వు తేదీ నుంచి 4 నెలల తర్వాత రైతు డిస్కం వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమయ్యే తేదీగా కమిషన్ ప్రకటించింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చట్టంలోని సెక్షన్ 131 ప్రకారం చట్టబద్ధమైన ట్రాన్స్‌‌ఫర్ స్కీమ్‌‌ను జారీ చేశాకే లైసెన్స్ అమల్లోకి వస్తుందని ఈఆర్సీ పేర్కొన్నది.

ఉత్తర, దక్షిణ డిస్కంల లైసెన్స్​లు మార్పు 

రైతు డిస్కమ్​ పరిధిలోకి ఉచిత వ్యవసాయ, ఇరిగేషన్​ తదితర విద్యుత్​ కనెక్షన్లు బదిలీ అవుతుండటంతో తమ పరిధిలోని కనెక్షన్లను తొలగించడానికి అనుమతించాలంటూ ఉత్తర, దక్షిణ విద్యుత్​ పంపిణీ సంస్థలు చేసిన దరఖాస్తులకు ఈఆర్సీ ఆమోదించి లైసెన్సులను సవరించింది. మిగతా వినియోగదారులకు సేవలందించే భౌగోళిక పరిధిలో మార్పు ఉండదని స్పష్టం చేసింది.

మోటార్లకు మీటర్లుండవ్..

 రైతుల వ్యవసాయ పంప్​ సెట్లు, మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా ఈఆర్సీ తన తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నది. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా యథావిధిగా కొనసాగుతుందని, భవిష్యత్తులో కూడా ఎలాంటి మార్పు ఉండదని సర్కారు చెప్పినట్టు స్పష్టం చేసింది.  రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కొత్త విద్యుత్​ కనెక్షన్ల మంజూరు ప్రక్రియను నిలిపివేయవద్దని ఈఆర్సీ పాత డిస్కంలను ఆదేశించింది. 

రైతు డిస్కం​ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఉత్తర, దక్షిణ డిస్కంలే రైతుల నుంచి యథావిధిగా దరఖాస్తులు స్వీకరించి కొత్త కనెక్షన్లు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఉద్యోగుల హక్కులు, సీనియారిటీ, పెన్షన్, రిజర్వేషన్ రోస్టర్, పదోన్నతి అవకాశాలకు ఎలాంటి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని కమిషన్ స్పష్టం చేసింది.

రైతు డిస్కంలోకి మారిన విద్యుత్​ కనెక్షన్లు

  • వ్యవసాయ ఉచిత విద్యుత్​ కనెక్షన్లు: 29,05,779
  • లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌‌లు 
  • (ఎల్ఐఎస్​) కనెక్షన్లు: 489
  •  హైదరాబాద్​ జలమండలి కనెక్షన్లు: 99
  • మిషన్  భగీరథ కనెక్షన్లు: 1,132
  • మున్సిపాలిటీల పరిధిలోని 
  • ప్రత్యేక డీటీఆర్‌‌‌‌ల  నీటి కనెక్షన్లు: 639