రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నం : ఎర్రబెల్లి

 రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలని కోరుకుంటున్నం : ఎర్రబెల్లి

తెలంగాణ కంటే బీజేపీ పాలితరాష్ట్రాలు బాగుంటే తాను రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు. బీజేపీ పాలించే రాష్ట్రాలకు వెళ్ళి చూద్దామంటే ఆ పార్టీ నాయకులు ముందుకు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ మొదటిస్థానంలో నిలిపిన కేసీఆర్..  దేశాన్ని కూడా అదే తీరులో నిలబెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగసభ చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత పెద్ద సభను ఎప్పుడూ చూడలేదంటూ చెప్పుకొచ్చారు. ఖమ్మం సభను చూసిన తర్వాత అయినా ప్రతిపక్షాలకు కనువిప్పు కలగాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం మానుకోవాలంటూ హెచ్చరించారు.  దేశంలో కనుమరుగవుతున్న కాంగ్రెస్ ను కాపాడుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించిన ఎర్రబెల్లి..  రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు.