బతుకమ్మ చీరలను అవమానిస్తే కఠిన చర్యలు

బతుకమ్మ చీరలను అవమానిస్తే కఠిన చర్యలు

హైదరాబాద్: బతుకమ్మ చీరలను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై తన నియోజకవర్గంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... బతుకమ్మ, దసరా పండుగల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, ఎలాంటి అవాంఛనీయం సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజ‌ల పండుగ‌ల‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోందని తెలిపారు. ఈ క్రమంలోనే బ‌తుక‌మ్మ పండుగ‌ను రాష్ట్ర  పండుగ‌గా ప్రక‌టించార‌న్నారు.  

ప్రతి ఏటా కోటి మందికి పైగా మ‌హిళ‌ల‌కు ప్రభుత్వ కానుక‌గా చీర‌లను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. 339.73 కోట్ల రూపాయ‌ల‌ను ఇందుకు ప్రభుత్వం ఖ‌ర్చు చేస్తోందన్నారు. దీంతో నేత‌న్నల‌కు చేతి నిండా ప‌ని దొరుకుతోంద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో బ‌తుక‌మ్మ పండుగ‌ను అత్యంత వైభంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రి ఆదేశించారు. చెరువుల వ‌ద్ద నిమ‌జ్జనానికి స‌క‌ల ఏర్పాట్లు చేయాల‌న్నారు. ప్రతి సారి లాగే తాను ఈ సారి కూడా నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా ప‌ర్యటిస్తాన‌ని తెలిపారు. మ‌హిళ‌లు అత్యంత భ‌క్తి శ్రద్ధలతో జ‌రుపుకునే పండుగ సంద‌ర్భంగా నిమ‌జ్జనాల స‌మ‌యంలో మ‌రింత జాగ్రత్తగా ఉండాల‌ని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.