మా సీఎం మేడారం అందుకే రాలె

మా సీఎం మేడారం అందుకే రాలె
  • అయితే మా ముఖ్యమంత్రినే ప్రశ్నిస్తరా: ఎర్రబెల్లి
  • ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు రాలేదని ప్రశ్న

మేడారం(జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి), వెలుగు: “పడిశెం బట్టి సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మేడారం మహా జాతరకు రాలే.. సీఎం సారు వస్తననుకున్నరు.. ఏర్పాట్లు కూడా చేసినం.. కానీ ఆరోగ్యం బాగ లేక రాలే.. అయితే మా సీఎంనే ప్రశ్నిస్తరా? ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు రాలే? గుళ్లు, గోపురాలు తిరుగుతరు.. హిందుత్వం అంటరు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను విమర్శించే బీజేపోళ్లను గిరిజనులు ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టాలే’’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌ రావు అన్నారు. మహాజాతర సక్సెస్‌‌‌‌‌‌‌‌ మీట్‌‌‌‌‌‌‌‌లో భాగంగా శనివారం మేడారంలో ఆయన మంత్రి ఇంద్రకరణ్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో కలిసి మాట్లాడారు. ‘‘మేడారం జాతర కాబట్టి రాజకీయాలు మాట్లాడవద్దని ఇంత వరకు ఊకున్నం. శుక్రవారం ఇక్కడికి వచ్చిన బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ ఏమని మాట్లాడతడు.. వాడు పిచ్చోడో.. మంచోడో నాకు అయితే తెల్వట్లేదు. పైసకు అక్కరకు రానోళ్లు కూడా మాట్లాడతరా.. పుల్లలు పేనితే ఎవరూ ఊకోరు.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు’’ అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్‌‌‌‌‌‌‌‌ వచ్చి అమ్మవార్లను దర్శించుకొని పోయారని, పీఎం నరేంద్ర మోడీ ఎందుకు రాలేదని ఎర్రబెల్లి ప్రశ్నించారు.  మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇస్తామని చెప్పి మాట తప్పిన బీజేపీ నాయకులను ఉరికించి ఉరికించి కొట్టాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. ఆదివాసీ గిరిజన జాతర కోసం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేశారని గుర్తు చేశారు. గంట గంటకు టచ్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చి సూచనలిస్తున్నారని తెలిపారు. మహా కుంభమేళాకు రూ.325 కోట్లిచ్చి, మేడారం జాతరకు రూ.2.5 కోట్లు ఇస్తారా అని ప్రశ్నించారు. ములుగులో గిరిజన వర్సిటీ తరగతులు ఇంకా ఎందుకు ప్రారంభిస్తలేరో ఆన్సర్‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలన్నారు.

కోటి 30 లక్షల మంది వచ్చిన్రు: ఇంద్రకరణ్​రెడ్డి
జాతరలో ఇప్పటి వరకు కోటి30 లక్షల మంది భక్తులు పాల్గొన్నారని మంత్రి ఇంద్ర కరణ్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. జాతర సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆఫీసర్లకు, మీడియాకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. తర్వాత జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ జి.పాటిల్‌‌‌‌‌‌‌‌, ప్రచార పౌర సంబంధాల శాఖ ఏడీ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌, డీపీఆర్‌‌‌‌‌‌‌‌వోలు ప్రేమలత, రవికుమార్‌‌‌‌‌‌‌‌, కిరణ్మయి, పల్లవి తదితరులకు శాలువాలు కప్పి మంత్రులు సన్మానించారు.