నాలాల ఆక్రమణల తొలగింపును ఆఫీసర్లపైకి నెట్టేయండి

నాలాల ఆక్రమణల తొలగింపును ఆఫీసర్లపైకి నెట్టేయండి
  •  గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్ లో కార్పొరేటర్లతో మంత్రి

వరంగల్రూరల్‍, వెలుగు: వరంగల్‍ సిటీలో నాలాల ఆక్రమణలపై జనాలు నిలదీస్తే ఆఫీసర్ల మీదికి నెట్టేయాలని కార్పొరేటర్లతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు చెప్పారు. జనాలు నిలదీస్తుంటే కార్పొరేటర్లకు కాస్త ఇబ్బంది ఉంటదని, ఈ టైమ్​లోనే గట్టిగా నిలబడాలని అన్నారు. శుక్రవారం హన్మకొండ అంబేడ్కర్‍భవన్​లో గ్రేటర్‍ వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ కౌన్సిల్‍ మీటింగ్‍ జరిగింది. నాలాలపై ఆక్రమణలు తొలగిస్తుంటే జనాలు నిలదీస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలో అర్థం కావట్లేదని సమావేశానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లితో కార్పొరేటర్లు చెప్పారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘నయీంనగర్‍, భద్రకాళి, బొందివాగు నాలాల అంశం మాట్లాడేందుకు నా దగ్గరోళ్లు, ఫ్రెండ్స్​గుంపులు గుంపులుగా వస్తున్నరు. నా మాదిరే మీరూ  చేతులెత్తేయాలె. అధికారుల మీదకు నెట్టేయాలె’ అన్నారు. అయితే మంత్రి కామెంట్స్ పై కార్పొరేషన్ ఆఫీసర్లు, స్టాఫ్ మండిపడుతున్నారు. ‘మంత్రి కేటీఆరేమో రాజకీయ ఒత్తిడి ఉండదు. ఆక్రమణలన్నీ కూల్చేయాలని చెప్పారు. లోకల్ లీడర్లేమో మా మీద కేసులు పెట్టించి కోర్టుల నుంచి స్టేలు తెప్పిస్తున్నారు. ఇప్పుడు మంత్రి ఎర్రబెల్లి అంతా మాపై నెట్టేయాలని చెబుతున్నారు. ప్రజల దృష్టిలో వాళ్లు హీరోలుగా ఉంటూ మమ్మల్ని విలన్లుగా చూపుతున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లీడర్ల పొలిటికల్ గేమ్

వానలకు వరంగల్ సిటీ నీట మునగడంతో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆగస్టు 18న నగరంలో పర్యటించారు. నాలాలపై ఆక్రమణల తొలగింపులో రాజకీయ జోక్యం ఉండదని కేటీఆర్, ఎర్రబెల్లి నాడు ఓపెన్​గా చెప్పారు. అధికారులు 384 నిర్మాణాలను గుర్తించి 282 కట్టడాలను కష్టపడి తొలగించారు. ఇంతలో 84 మంది కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడంతో పనులు ఆగిపోయాయి. ఈ స్టేల వెనుక అధికార పార్టీ లీడర్లున్నారని ఆరోపణలున్నాయి. పలువురు లీడర్లు మొదటి నుంచి పొలిటికల్ గేమ్ ఆడుతున్నారని, జనాల్లో వాళ్లు సేఫ్​గా ఉంటూ ఆఫీసర్లపైకి అంతా నెట్టేసేలా మాట్లాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పైకి తొలగించమంటూనే తెర వెనుక తమ వారికి స్టే ఐడియా ఇచ్చినట్టు ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. తాము ప్రభుత్వం చెబితే చేసే ఉద్యోగులమని, ఆ విషయం తెలిసీ తమపై లీడర్లు కేసు పెట్టిస్తున్నారని వాపోతున్నారు. ఇలా లీడర్లు ఎంకరేజ్​ చేస్తుంటే కూల్చడానికి వెళ్లినప్పుడు తమపై దాడి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు.     ​