
పసిపిల్లలపై జరిగే దారుణాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన దారుణాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఘటనపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ గా ఉన్నారని చెప్పారు. సమాజంలో ఇలాంటి దారుణాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఏదో రకంగా చైతన్యం కల్పించాలని కోరారు.
ఈ రోజు పాలకుర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కింద టీఆర్ఎస్ ప్రభుత్వం సంవత్సరానికి ప్రతీ రైతుకు రూ.10 వేలు ఇచ్చిందన్నారు. కాళేశ్వరం ద్వారా ప్రతి రైతుకు 50 వేలు ఖర్చు చేస్తున్నట్టు ఎర్రబెల్లి తెలిపారు.
రాష్ట్రంలో 123 మంది ఆడపడుచులకు అండగా సీఎం కేసీఆర్ కోటి ఇరవై మూడు లక్షల కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేశారని ఎర్రబెల్లి అన్నారు. వచ్చే నెల నుండి వృద్దులకు 2000/-, వికలాంగులకు 3000/- పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. వచ్చే నెలలో రైతులకు లక్షరుపాయల రుణమాఫీ చేస్తామన్నారు.