యాదాద్రిలో బయటపడుతున్న లోపాలు

యాదాద్రిలో బయటపడుతున్న లోపాలు
  • వానలకు మరోసారి కుంగిన ఆలయం ఫ్లోరింగ్
  • క్యూ లైన్ ఏర్పాటులో కొరవడిన ప్లానింగ్
  • వానతో చిత్తడిగా మారుతున్న ఆలయ పరిసరాలు
  •  సంగీత్ భవన్ లేక కళాకారుల అవస్థ

ఎండాకాలమైనా, వానాకాలమైనా.. సీజనేదైనా యాదాద్రిలో భక్తులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ రూ. 1,250 కోట్లతో నర్సన్న టెంపుల్ ను గొప్పగా నిర్మించామని సర్కారు చెబుతుంటే.. రోజులు గడిచేకొద్దీ ఒక్కొక్కటిగా లోపాలు బయటపడుతున్నాయి. ఎండలు మండినా, వానలు పడ్డా కొండపై తల దాచుకోవడానికి నిలువ నీడ లేక భక్తుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. దివ్యాంగులు స్వామిని దర్శించుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు లేవు. కొండపై గతంలో ఉన్న సంగీత్​భవన్​ను కూలగొట్టిన ఆఫీసర్లు మళ్లీ కట్టకపోవడంతో కళాకారుల ప్రదర్శనకు వేదిక లేకుండా పోయింది.  రెండు రోజుల క్రితం ప్రధానాలయంలో ఫ్లోరింగ్​కుంగింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుట్ట పరిసరాలు అస్తవ్యస్తంగా మారాయి. 

యాదగిరిగుట్ట : దేశంలో ఎక్కడా లేనివిధంగా నరసింహుడి ప్రధానాలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో గొప్పగా నిర్మించిన ప్రభుత్వం.. కొండపై భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. కొండపైన బస్ బే, క్యూలైన్లలో తప్ప ఎక్కడా భక్తులు కాసేపు నిల్చోడానికి నీడన్నది లేకుండా పోయింది. ఈ ఏడాది వేసవిలో కొండపై సరిపడా చలువ పందిళ్లు ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఎడతెరిపి లేని వానలకు ఆలయ పరిసరాలు చిత్తడిగా మారాయి. వీఐపీ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి బురదలోనుంచే నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. భక్తులు తూర్పు రాజగోపురం నుంచి మొదటి ప్రాకారంలోకి ఎంటర్ అయ్యాక క్యూలైన్లకు పైకప్పు లేకపోవడంతో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. 

రద్దీ ఉన్నా.. లేకున్నా తప్పని క్యూ
స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన క్యూలైన్ల తీరు పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన క్యూకాంప్లెక్స్ ను ర్యాంపుల మీదుగా ఎక్కుతూ క్యూలైన్లలోకి చేరుకోవాల్సి వస్తోంది. మూడో అంతస్తులో ప్రసాద విక్రయ కేంద్రం పక్కన ఏర్పాటు చేసిన ర్యాంప్ నుంచి ప్రధానాలయం ఎదుట తూర్పు దిశలో ఉన్న ప్రధాన క్యూలైన్ లోకి చేరుకుంటారు. అక్కడి నుంచి దక్షిణం వైపు నుంచి అష్టభుజి ప్రాకార మండపంలోకి.. తర్వాత తూర్పు రాజగోపురం గుండా ఆలయంలోకి ఎంటర్ అవుతారు. ఇదంతా తిరగడానికి రద్దీ అధికంగా ఉన్నప్పుడు మూడు గంటలకు పైగా..  రద్దీ లేని టైంలో దాదాపు గంట సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో తూర్పు రాజగోపురం నుంచి నేరుగా ఆలయంలోకి చేరుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇక దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లుగానీ, క్యూలైన్లుగానీ లేకపోవడంతో.. ధర్మదర్శన క్యూలైన్లలో నుంచే వీల్ చైర్ లో వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కళాకారులకు కొరవడిన వేదిక
నరసింహస్వామి క్షేత్రంలో భక్తుల కళాప్రదర్శనకు, ముఖ్యమైన పర్వదినాలలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కొండపై వేదిక లేకుండా పోయింది. సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన ఇవ్వడానికి గతంలో కొండపై సంగీత్ భవన్ ఉండేది. కానీ ఆలయ పునర్నిర్మాణం కోసం సంగీత్ భవన్ ను కూల్చివేసిన ఆఫీసర్లు.. మళ్లీ నిర్మించలేదు. దీంతో కళాకారులు ప్రదర్శనలు ఇవ్వడానికి ప్లేస్ లేకుండా పోయింది. గత ఆదివారం తొలి ఏకాదశి రోజున కళాకారులు వానలో తడుస్తూనే కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శన ఇచ్చారు. ఆలయ మాడవీధుల్లోనే మేకప్ వేసుకుని, ఆలయ తూర్పు దిశలో ఉన్న బ్రహ్మోత్సవ మండప ప్రాంగణంలో ముసురులో తడుస్తూనే నృత్యాలు చేశారు.

రెండోసారి కుంగిన ఫ్లోరింగ్
వారం రోజులుగా కురిసిన వానకు ప్రధానాలయంలో లోటుపాట్లు మరోసారి బయటపడ్డాయి. బుధవారం కొద్దిపాటి ముసురుకే ప్రధానాలయ దక్షిణ ఫ్లోరింగ్ కుంగింది. దక్షిణ రాజగోపురం పక్కన కృష్ణశిలతో ఏర్పాటు చేసిన ఫ్లోరింగ్ బండలు 10 మీటర్ల మేర 3 ఇంచుల కిందికి కుంగాయి. గతంలో కూడా కొద్దిపాటి వర్షానికే ఫ్లోరింగ్ కుంగడంతో రాతిబండలు తొలగించి రిపేర్లు చేశారు. ఏడాది గడవకముందే మళ్లీ ఫ్లోరింగ్ కుంగిపోవడంతో పనుల నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది.

దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి
స్వామివారి దర్శనానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక దర్శన సదుపాయాలు కల్పించాలి. ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో వీల్ చైర్ లో కూర్చుని మూడు అంతస్తుల క్యూ కాంప్లెక్స్ తిరుగుతూ ధర్మదర్శన క్యూలైన్ల నుంచే వెళ్లాల్సి వచ్చింది. డైరెక్టుగా స్వామివారి దర్శనం జరిగేలా దివ్యాంగులు, వృద్ధులకు సదుపాయాలు కల్పించాలి. -  సులోచన, శాలిబండ

వానొస్తే తడవాల్సిందే
వర్షం వస్తే కొండపైన నిల్చోడానికి ప్లేస్ లేదు. తిరుమలలో ఉన్న విధంగా అత్యవసర ఏర్పాట్లు చేయాలి. అలాగే గుట్టపై ఏర్పాటు చేసిన దర్శన క్యూలైన్ల అమరిక సరిగా లేదు. భక్తుల రద్దీ లేకున్నా గంటల తరబడి క్యూలైన్లలో తిరగాల్సి వస్తోంది. రద్దీ తక్కువగా ఉన్న సమయంలో నేరుగా ఆలయంలోకి చేరుకునే విధంగా ప్రత్యామ్నాయ క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. – మహేశ్, ఉప్పల్

బురదతో ఇబ్బంది పడ్డాం
వర్షం కారణంగా ఆలయ పరిసరాలు చిత్తడిగా మారడంతో ఇబ్బందులు పడ్డాం. వాన తగ్గి 24 గంటలు గడుస్తున్నా బురదమయం అయిన పరిసరాలను సరిదిద్దలేదు. వర్షం వస్తే తలదాచుకోవడానికి కొండపైన సదుపాయాలు లేవు. బస్ బే, క్యూలైన్లు, మాడవీధులు తప్ప మరోచోట నిల్చోడానికి వీలు లేకుండా ఉంది. – వసంత్, హైదరాబాద్