కాళేశ్వరం పనుల్లో లోపాలు.. పైకి తేలిన పైపు

కాళేశ్వరం పనుల్లో లోపాలు.. పైకి తేలిన పైపు
  • సరస్వతి పంప్​హౌస్​ నుంచి సుందిళ్ల బ్యారేజ్​​ మధ్య 200 మీటర్ల మేర తేలింది
  • మట్టి పోసి కవర్​ చేస్తున్న ఇరిగేషన్ ఆఫీసర్లు
  • లైన్​ మొత్తం పోయినట్లే అనే అనుమానాలు
  • కొత్తది వేసే దాకా పాతది మూసేయాల్సిందే

పెద్దపల్లి, వెలుగు: కాళేశ్వరం పనుల్లో మేఘా కంపెనీ లోపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. కాళేశ్వరం లిఫ్టు స్కీంలో భాగంగా సరస్వతి పంప్​హౌస్​ నుంచి సుందిళ్ల బ్యారేజ్​​లోకి నీటిని ఎత్తిపోసేందుకు భూమిలో పాతిన భారీ పైపులైన్ ఇటీవల పైకి తన్నుకొచ్చింది. సుమారు 700 మీటర్ల పొడువున్న ఈ ఐరన్​ పైపులైన్​లో ఏకంగా 200 మీటర్ల మేర  బయటకు తేలింది. జూన్​16 నుంచి 20 రోజులు కాళేశ్వరం పంపులను రన్​ చేశారు. ఈ క్రమంలో నీటి ప్రెషర్​ను తట్టుకోలేకే పైపులైన్ పైకి లేచినట్లు భావిస్తున్నారు. ఆఫీసర్లు మాత్రం ఈమధ్య వచ్చిన వరదలు, బ్యాక్​వాటర్​ వల్ల  పైకి లేచిందని చెబుతూ, పైపులైన్​ మీద మట్టి కప్పుతూ కవర్​ చేస్తున్నారు. గతేడాది కాళేశ్వరం మెయిన్​ కెనాల్​ లైనింగ్​ కూడా దెబ్బతిన్నది. 

ప్రెషర్​ తట్టుకోలేకే..!
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ నుంచి అన్నారం రిజర్వాయర్​లో ఎత్తిపోసే నీళ్లు, పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజుపడుగు వద్ద నిర్మించిన సరస్వతి పంప్​హస్​ ద్వారా సుందిళ్ల బ్యారేజ్​కు చేరుతాయి. ఇందుకోసం సరస్వతి పంప్​హౌస్​లో 12 మోటార్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి ప్రతి మోటార్​కు రెండు పైపులైన్ల చొప్పున మొత్తం 24 పైపులైన్ల ద్వారా సుందిళ్ల బ్యారేజీలోకి ఎత్తిపోస్తారు. ఇందుకోసం 10 ఫీట్ల డయా, 15 ఫీట్ల ఎత్తు కలిగిన భారీ ఐరన్​ పైపులను వినియోగించారు. వీటిని భూమిలో 5 ఫీట్ల లోతున పాతి, ఒకదానితో మరొకటి జాయింట్​ చేశారు. జూన్ 16న ఆఫీసర్లు లక్ష్మి, సరస్వతి, పార్వతి పంప్​హౌస్​ల వద్ద మోటార్లు స్టార్ట్ చేశారు. 20 రోజులు 32 టీఎంసీల నీళ్లను మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీలోకి,  అన్నారం నుంచి సుందిళ్ల బ్యారేజీలోకి 29.72 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేశారు. పార్వతి నుంచి ఎల్లంపల్లికి, ఎల్లంపల్లి నుంచి మిడ్​మానేరుకు మరో 23.32 టీఎంసీలు ఎత్తిపోశారు. ఆ తర్వాత వర్షాలు కురవడం, వరద రావడంతో పైపులైన్లను బంద్​పెట్టారు. పంపులు నడిచినప్పుడే మంథని మండలం సిరిపురం వద్ద ప్రెషర్​ తట్టుకోలేక ఒక పైపులైన్​ భూమి నుంచి పైకి లేచినట్లు తెలుస్తోంది.

మేఘా తప్పును కవర్​ చేస్తున్న ఇరిగేషన్​ శాఖ  
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్ని బ్యారేజీలు, పంప్​హౌస్​లు, పైపులైన్​, కెనాల్ వర్క్స్​ను గంపగుత్తగా మేఘా కంపెనీ  దక్కించుకొని నిర్మించింది. కానీ పైపులైన్​ పైకి లేవడాన్ని బట్టి వాటర్​ ప్రెషర్​ను, ఇక్కడి నేల స్వభావాన్ని అంచనా వేయడంలో మేఘా ఆఫీసర్లు, ప్రాజెక్టు ఇంజినీర్లు ఫెయిల్​ అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదా భూమిలో పాతిన పైపులైన్ ​వాలు విషయంలో తేడా వచ్చి ఉండాలని చెప్తున్నారు. భూమికి 5 ఫీట్ల లోపల పాతి, జాయింట్​చేసిన పైపులైన్​ ఏకంగా 200 మీటర్ల పొడవునా పైకి లేవడాన్ని పెద్ద ఫెయిల్యూర్​గా భావించాలని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మిగతా పైపులైన్ల పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. మేఘా చేసిన తప్పిదాన్ని కవర్​ చేసేందుకు ఇరిగేషన్​ ఆఫీసర్లు తెగ కష్టపడుతున్నారు. పైపులైన్​ బయటికి వచ్చిన గత జూన్​ నెలలోనే దీనిపై మట్టి పోసి కప్పినట్లు తెలుస్తుండగా.. తాజా వర్షాలకు అది కొట్టుకుపోయింది. పైపులు జాయింట్​ చేసి ఉండడం, గతంలో తీసిన కాల్వ పూడకపోవడంతో పైపులైన్​ను ఇప్పటికిప్పుడు ఏమీ చేసే పరిస్థితి లేదని ఇంజినీర్లు అంటున్నారు. మొత్తం పాత పైపులైన్​ తొలగించి, మళ్లీ కొత్త పైపులైన్​ వేయాల్సిందేనని, అప్పటిదాకా ఆ పైపులైన్​ ద్వారా నీళ్ల తరలింపు ఉండదని చెప్తున్నారు.

గతేడాది దెబ్బతిన్న మెయిన్​ కెనాల్​
గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌‌‌‌పూర్​ ‌‌మండలంలోని కాళేశ్వరం మెయిన్​ కెనాల్​ లైనింగ్​దెబ్బతిన్నది. ఈ కెనాల్​పై 6వ కిలోమీటర్ వద్ద పైనుంచి కిందికి రోడ్డు కూలి, సిమెంట్‌‌‌‌కాంక్రీట్‌‌‌‌ధ్వంసం కాగా, 6.7 కిలోమీటర్ల వద్ద  8.5 మీటర్ల పొడవు  7 మీటర్ల వెడల్పుతో పూర్తిగా సిమెంట్‌‌‌‌ కాంక్రీట్‌‌ ‌‌కొట్టుకుపోయింది. లూజ్‌‌ ‌‌సాయిల్‌‌ ‌‌ఉన్న చోట నాసిరకం పనులు చేపట్టడం వల్లే కెనాల్‌‌ దెబ్బతిన్నదనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ ‌‌లింక్‌‌‌‌‒1 పనుల్లో భాగంగా 13.6 కి.మీ దూరం కెనాల్‌‌ ‌‌నిర్మాణ పనులను, కెనాల్‌‌‌‌ను ఆనుకొని బీటీ రోడ్డు నిర్మాణానికి మేఘా కంపెనీ ఏకంగా రూ. 600 కోట్లు తీసుకుంది. కానీ అప్పట్లో పనులు పూర్తయిన ఏడాదిన్నరకే  క్వాలిటీ లోపాలు బయటపడ్డాయి.

పైపులు ఎందుకు పైకి లేసినయో ఆఫీసర్లు చెప్పాలి
సరస్వతి పంప్​హౌస్​ నుంచి వేసిన ఓ పైపులైన్​ భారీ శబ్దంతో బయటకు తన్నుకువచ్చింది. దీంతో చుట్టుపక్కల పొలాల్లోని రైతులు బెదిరిపోయిండ్రు. మిగిలిన పైపులు ఇట్లనే బయటకు వస్తయేమోనని స్థానికులు భయపడుతున్నరు.  పైపులు ఎందుకు పైకి లేస్తున్నయో ఆఫీసర్లు చెప్పాలి. దీని వల్ల ప్రజలకు ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత? భవిష్యత్​లో ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఊదరి శంకర్, రైతు,  గుంజపడుగు, పెద్దపల్లి జిల్లా