- తేలిన ల్యాండ్ లెక్కలు.., చేతులు మారకుండా చర్యలు
- సర్వే నెంబర్లు సహా 22ఏలో ఇండ్లు, అసైన్డ్ ల్యాండ్, ఇరిగేషన్, రోడ్లు, ప్రభుత్వ భూములు
జనగామ, వెలుగు: భూములు చేతులు మారి, అనర్హుల చేతికి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన సాగు భూములతో పాటు ప్రభుత్వ ఆధీనంలోని అన్ని రకాల భూములను నిషేధిత (22 ఏ) జాబితాలోకి చేర్చింది.
రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908..
ఉమ్మడి రాష్ట్రంలో 2006కు ముందు ప్రభుత్వ భూములు పీవోబీలో లేకపోవడంతో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ పరిణామంతో అప్పటి ప్రభుత్వం ప్రభుత్వ భూములను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చింది. ఆ తర్వాత 2012, 2013లో భూముల వివరాలు పరిశీలన జరిగినట్టుగా ఆఫీసర్లు చెబుతున్నారు. 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన తర్వాత 2021లోనూ భూముల వివరాలను పరిశీలించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలోని భూముల పరిరక్షణ కోసం వాటిని రిజిస్ట్రేషన్ యాక్ట్ 1308 సెక్షన్ 22 ఏలో చేర్చాలని నిర్ణయించింది. పాత పహాణీలను పరిశీలించడం ద్వారా అసైన్డ్, సీలింగ్, భూదాన్ భూములను రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 సెక్షన్ 22 ఏ (1), (బీ) కింద సర్వే నెంబర్ల వారీగా చేర్చారు. దేవాదాయ, వక్ఫ్ భూములను 22 ఏ (1), (సీ) కింద వేర్వేరుగా చేర్చారు. సిట్, ఏసీబీ, ఎన్ఫోర్ట్మెంట్, ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగించిన వివాదస్పద భూములు, ఇతర ఆస్తులను 22ఏ (1), (ఇ) కింద చేర్చారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో నిర్మించిన ఇండ్లను కూడా 22ఏ(1), (ఏ) కింద చేర్చారు. ఈ సెక్షన్లో చేర్చిన భూములు, ఇండ్లు ఇక రిజిస్ట్రేషన్లు జరగవు.
24,364 ఎకరాల్లో ఇండ్లు, ఇరిగేషన్, రోడ్లు, జనగామ జిల్లాలోని 17 మండలాల్లో 176 రెవెన్యూ గ్రామాలున్నాయి. మొత్తంగా 280 పంచాయతీలున్నాయి. వాటి పరిధిల్లో ఏడాదిగా పాత రికార్డులను పరిశీలించిన ఆఫీసర్లు భూముల లెక్కలు తేల్చారు. జిల్లాలోని 24,941 సర్వే నెంబర్లలో పేదలకు ఇచ్చిన స్థలాల్లో ఇండ్లు, రాష్ట్ర, జాతీయ రహదారులతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల కాల్వలున్నాయి. ఈ సర్వే నెంబర్లలో మొత్తంగా 24,364 ఎకరాల్లో విస్తరించిన ఆయా ఆస్తులు చేతులు మారకుండా సర్వేనెంబర్లతో కూడిన వివరాలు, లబ్ధిదారుల వివరాలను 22ఏ(1), (బీ)లో పొందుపర్చారు. వీటిలో ఇండ్లు కూడా పెద్దసంఖ్యలో ఉన్నాయి.
అసైన్డ్ ల్యాండ్ 29,311 ఎకరాలు..
ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి జిల్లాలో పేదలకు భూ పంపిణీ చేశారు. వీటిని కొందరు అమ్ముకోగా, ఎక్కువగా వారసుల చేతిలో ఉన్నాయి. అయితే ఇవి కూడా చేతులు మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 38,970 సర్వే నెంబర్లలో 29,311 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారుల చేతుల్లో ఉంది. ఈ భూమిని మొత్తం 22 ఏ (1) కింద చేర్చింది.
31,467 ఎకరాల ప్రభుత్వ భూమి..
అసైన్డ్ ల్యాండ్, ఇరిగేషన్, రోడ్లు పోనూ ప్రభుత్వ పరిధిలో పెద్ద ఎత్తున భూములు ఉన్నాయి. వీటిని అక్కడక్కడ కబ్జా చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ భవనాలు, ఇతరేతర ఆఫీసులు సహా 4949 సర్వే నెంబర్లలో 31,467 ఎకరాల భూమి ఉంది. ఈ పరిస్థితుల్లో వీటిని కూడా నిషేధిత జాబితాలో చేర్చింది.
