
మహబూబ్‍నగర్, వెలుగు: పెళ్లయిన రెండెళ్లకే అత్తింటివాళ్లు నరకం ఏందో చూయించారు… హింసించి ఇంటి నుంచి గెంటేశారు. అయినా ఆ ఇల్లాలు నిరాశ చెందలేదు. టెట్ లో అర్హత సాధించి.. టీఆర్టీలో మంచి మార్కులతో టీచర్ జాబ్ సంపాదించుకుంది. గురువారం టీఆర్‍టీ కౌన్సిలింగ్ లో ఆ ఇల్లాలి దీనగాథ వెలుగులోకి వచ్చింది. నారాయణపేట జిల్లా కోయిలకొండ మండలం గార్లపాడుకు చెందిన ఈశ్వరమ్మకు 2014లో జోగులాంబ గద్వాల జిల్లాలోని పుటాన్‍దొడ్డి గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లయింది. భర్త ఆటో డ్రైవర్. ఈమె టీచర్ ట్రైనింగ్ కోర్స్ (టీటీసీ) చేసింది. రెండేళ్లవరకు అంతా బాగానే సాగింది. తర్వాత అత్తామామలు ఇంటినుంచి బలవంతంగా గెంటేశారు. భర్త మాత్రం అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. బిడ్డకు జన్మనిచ్చిన ఈశ్వరమ్మ.. బాధను దిగమింగుకొని టీచర్ పోస్టు కోసం కష్టపడి చదివింది. వేల మందితో పోటీ పడి టీచర్ జాబ్ కొట్టింది. తమ కోడలు టీచర్ అవుతుందని తెలుసుకున్న అత్తామమాలు కాపురానికి రమ్మని ఆమె ను బతిమాలుతున్నరు.