శాసన సభ్యులను గడ్డి పోచల్లాగా అవమానిస్తున్నరు

శాసన సభ్యులను గడ్డి పోచల్లాగా అవమానిస్తున్నరు

అసెంబ్లీ సమావేశాలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ 6,12,13 వ తేదీల్లో మాత్రమే సమావేశాలు అని నోటీసులు పంపారని చెప్పారు. చరిత్రలో ఎప్పుడు ఇంత తక్కువ సమావేశాలు జరగలేదన్నారు. బీఏసీని సంప్రదించకుండా సమావేశాలను మూడు రోజులకే పరిమితం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ అహంకారనికి ఇదే నిదర్శనమని చెప్పుకొచ్చారు. శాసన సభ్యులను గడ్డి పోచల్లాగా అవమానిస్తు్న్నారని ఆరోపించారు. సమావేశాలు రెండు, మూడు రోజులకే పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు.

గతేడాది  బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై అడిగినందుకు మమ్మల్ని అకారణంగా సస్పెండ్ చేశారన్నారు. ఈ సమావేశాల్లో పోడు భూములు,దళిత బంధు, ప్రజా సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. ప్రజల పక్షాన బీజేపీ ఉంటుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో  గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి, అసెంబ్లీ వద్ద సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహనికి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు నివాళులు అర్పించారు.

ప్రజలు ఎవరూ సంతోషంగా లేరు..

తెలంగాణ గడ్డమీద ఎవరూ సంతోషంగా లేరని ఈటల రాజేందర్ అన్నారు. చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతూ తమకు వినతులు వస్తున్నాయని చెప్పారు. .విఆర్ ఏ ,గ్రామ కార్యదర్శులు ,గెస్ట్ లెక్చరర్లు ఆత్మహత్యలకు పాల్పడతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17 ను మరిచిపోయారన్నారు. అమిత్ షా స్వయంగా సెప్టెంబర్ 17 ను అధికారికంగా జరిపి అండగా ఉంటామని చెప్పారన్నారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చిందని చురకలంటించారు.

సెప్టెంబర్ 17న కవాతు
సెప్టెంబర్ 17 తెలంగాణ భారత దేశంలో విలినమైన రోజ అని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఆపరేషన్ పోలో ద్వారా సర్ధార్ వల్లబ్ భాయ్ పటేల్ నిజాం నవాబుకు వ్యతిరేకంగా భారత్ లో విలీనం చేశారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17 విలీన దినోత్సవం జరపాలని చాలా సంవత్సరాలుగా బీజేపీ పోరాడుతుందన్నారు. రాష్ట్ర విభజనకు ముందు టీఆరెస్ కూడా అధికారికంగా జరపాలని చెప్పిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 ను అధికారికంగా నిర్వహిస్తామని..పెరేడ్ గ్రౌండ్ లో కవాతు ఉంటుందన్నారు.