పోలీసుల వాహనాల్లోనే డబ్బు సంచులను తరలిస్తుండ్రు: ఈటల

పోలీసుల వాహనాల్లోనే డబ్బు సంచులను తరలిస్తుండ్రు: ఈటల

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి టీఆర్ఎస్ నాయకులు పోలీసుల వాహనాల్లోనే డబ్బు సంచులను తరలిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సోమవారం మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేయగా... ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామితో పాటు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని తెలిపారు. రాజీనమా తర్వాత ఆయనకు వస్తున్న ప్రజా స్పందనను చూసి కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు వచ్చారని విమర్శించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కుట్రతో సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు పంచి పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసుల ఆధ్వర్యంలో జరగడం సిగ్గచేటని మండిపడ్డారు. టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడులో తీష్ట వేశారని, వారంతా ఇక్కడి ప్రజలను రకరకాలుగా ప్రలోభపెడుతున్నారని ఫైర్ అయ్యారు. 

బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తుండ్రు

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని, రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు బంద్ పెడ్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఈ విజయంతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కూడా పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం ఓ చిన్న గ్రామానికి ఎన్నికల ఇంచార్జ్ గా రానుండటం చూస్తే టీఆర్ఎస్ లో ఓటమి భయం మొదలైందని అర్థమవుతుందన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు 4 కోట్ల మంది ఆత్మగౌరవానికి ప్రతీక అని ఈటల రాజేందర్ తెలిపారు.  టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులను తీసుకోవాలని, ఓటు మాత్రం బీజేపీకే వేయాలని కోరారు. మునుగోడులో టీఆర్ఎస్ డబ్బు పంపిణీపై చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ ఎన్నికల కమిషన్ ను కోరారు.