కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారు: ఈటల రాజేందర్

కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారు: ఈటల రాజేందర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుక్కుంటోంది అంటూ సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అసలు రాజకీయ నాయకులను కొనుగోలు చేసే సంస్కృతిని తీసుకువచ్చింది కేసీఆరేనని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు లేకుండా చేసింది ఆ పెద్ద మనిషే అంటూ కేసీఆర్ పై ఈటల నిప్పులు చెరిగారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను డబ్బులు పెట్టి కొన్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను నిండా ముంచేశారని మండిపడ్డారు. తెలంగాణలో 20 ఏళ్లు పాలించిన తెలుగుదేశం పార్టీని కూడా.. కనుమరుగు లేకుండా చేసింది కేసీఆరేనని ఈటల ఆరోపించారు. కేసీఆర్, పీకేలు కలిస్తే ప్రజలను గోల్ మాల్ చేస్తారని ముందుగానే అనుకున్నామని.. అనుకున్నట్లే జరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. 

హుజురాబాద్ ఉపఎన్నిక సమయంలో తనను ఓడించేందుకు కుట్ర రాజకీయాలు చేశారని ఈటల గుర్తు చేశారు. అక్కడి ప్రజలకు మద్యం పోయించారని.. దళితబంధు పేరుతో ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున పంచిపెట్టారని అన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజురాబాద్ ప్రజలు ధర్మాన్నే గెలిపించారని ఈటల తెలిపారు. ప్రజల కోసం పోరాడే సీపీఐ, సీపీఎం పార్టీల గొంతు నొక్కేశారని ఆరోపించారు. హుజురాబాద్ లో చేసినట్లు.. ఇప్పుడు మునుగోడులో కూడా  కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మునుగోడు ప్రజలు ధర్మాన్నే గెలిపిస్తారని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.