మోడీతో యూరోపియన్ యూనియన్ బృందం భేటీ.. రేపు కశ్మీర్ పర్యటన

మోడీతో యూరోపియన్ యూనియన్ బృందం భేటీ.. రేపు కశ్మీర్ పర్యటన

ఉగ్రవాదమే విధానంగా పెట్టుకున్న దేశానికి బుద్ధి చెప్పాల్సిందే: ప్రధాని

న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటు సభ్యుల బృందం ఇవాళ ప్రధాని మోడీని ఆయన అధికార నివాసంలో కలిసింది. జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ నెలకొన్న పరిస్థితులపై 28 మంది సభ్యుల టీమ్ ఆయనతో చర్చించిందని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కూడా వారు భేటీ అయ్యారు. మంగళవారం ఈ బృందం కశ్మీర్ లో పర్యటించబోతోంది.

ఈ పర్యటనతో బంధం బలపడాలన్న మోడీ

ఈయూ బృందంతో భేటీ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఉగ్రవాదానికి మద్దతిస్తూ టెర్రరిస్టుల్ని ప్రొత్సహించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. టెర్రరిజమే తమ విధానంగా పెట్టుకున్న దేశానికి తగిన బుద్ధి చెప్పాలంటూ పాక్ పై పరోక్షంగా ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని చెప్పారు మోడీ.

జమ్ము కశ్మీర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈయూ బృందం పర్యటన విజయవంతం కావాలని ప్రధాని మోడీ అన్నారు. కశ్మీర్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారాయన. ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ఆ ప్రాంత సాంస్కృతిక, మత వైవిధ్యాన్ని వారి పర్యటన ద్వారా అవగాహన చేసుకోవాలని మోడీ ఆకాంక్షించారు. భారత్ తో ఈయూ సంబంధాలు ఈ పర్యటనతో మరింత బలపడాలని అన్నారాయన.