ఆర్టీసీ బిల్లు ఎక్కడ : రాజిరెడ్డి

ఆర్టీసీ బిల్లు ఎక్కడ  : రాజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లు ప్రస్తుతం ఎక్కడ ఉందని ఎంప్లాయిస్ యూనియన్ (ఈయూ) జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి ప్రశ్నించారు. గవర్నర్ గత నెల 6న లీగల్ ఓపీనియన్ కోసం లా సెక్రటరీకి పంపారని, ఓపీనియన్ ఇచ్చారా? లేదా? అని ఆయన అడిగారు. ఆర్టీసీ బిల్లు ఆర్ అండ్ బీ దగ్గర ఉందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోందన్నారు. వేలాది కార్మికులకు సంబంధించిన బిల్లుపై ప్రభుత్వం ఎందుకు లేట్ చేస్తోందని రాజిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. బిల్లును గవర్నర్ కు వెంటనే పంపాలన్నారు. 

బిల్లులో పీఆర్సీల గురించి ప్రభుత్వం ప్రస్తావించలేదని, వెంటనే రెండు పీఆర్సీలను మెన్షన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విలీనం బిల్లు ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతారని, కానీ పెండింగ్ లో ఉన్న 2017, 2021 పేస్కేల్స్ గురించి ప్రస్తావించలేదని.. కార్మికులకు నష్టం చేయాలనే ఉద్దేశంతోనే పీఆర్సీలను పేర్కొనలేదని ఆయన ఆరోపించారు. రెండు పీఆర్సీలు ఇవ్వకుండా ఇప్పుడున్న బేసిక్ పేను ప్రభుత్వ బేసిక్ లో కలిపితే కార్మికులు ఒక్కొక్కరు రూ.10 లక్షల నుండి రూ.15 లక్షల వరకు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. కార్మికులు పీఆర్సీల కోసం ఏడేండ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు.